Google Data Centre: గూగుల్ డేటా సెంటర్ టీమ్ తో నారా లోకేష్ భేటీ!
- శాన్ ఫ్రాన్సిస్కోలో భేటీ
- రియల్ టైమ్ గవర్నెన్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నామన్న లోకేష్
- మినీ క్లౌడ్ సెంటర్లను ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానం
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికాలో ఇన్వెస్ట్ మెంట్ రోడ్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ డేటా సెంటర్ టీమ్ తో ఆయన భేటీ అయ్యారు. గూగుల్ టీమ్ లో పార్థసారథి రంగనాథన్, రామా గోవిందరాజు, యాస్పీ సింగపోరియా తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ఏపీ ప్రభుత్వం ఎన్నో సేవలు అందిస్తోందని చెప్పారు.
ఫైబర్ గ్రిడ్ ద్వారా రూ. 149కే ఇంటర్నెట్, టెలివిజన్, ఫోన్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో వ్యవసాయంలో 24 శాతం వృద్ధిని సాధించామని చెప్పారు. ఏపీని క్లౌడ్ హబ్ గా మార్చేందుకు అనేక పాలసీలను రూపొందించామని తెలిపారు. క్లౌడ్ సెంటర్లను ఏర్పాటు చేసేవారికి రాయితీలను కల్పిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రంగం, హెల్త్ కేర్ రంగాల్లో గూగుల్ సహకారం కావాలని కోరారు. గూగుల్ క్లౌడ్ మినీ క్లస్టర్లను ఏపీలో ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు.