Padmaavat: 'పద్మావత్' విజయంపై రాజ్ పుత్ కర్ణిసేన స్పందన
- చరిత్రను వక్రీకరించారు
- చిత్తోర్ గఢ్ కోట ద్వారాన్ని ఖిల్జీ పగలగొట్టలేదు
- 25 ఏళ్ల వయసులో ఖిల్జీ దండెత్తినట్టు చూపించారు
అనేక వివాదాల మధ్య విడుదలైన బాలీవుడ్ మూవీ 'పద్మావత్' విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇప్పటికే రూ. 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తాజాగా 'పద్మావత్' కలెక్షన్లపై రాజ్ పుత్ కర్ణిసేన స్పందించింది. ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయని... మంచి కలెక్షన్లు వస్తున్నాయంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కర్ణిసేన ప్రతినిధి విజేంద్ర సింగ్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. మన దేశంలో సన్నీలియోన్ కు కూడా అభిమానులు ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారని విజేంద్ర మండిపడ్డారు. గర్భవతి ఆత్మాహుతి (జౌహార్)కి పాల్పడ్డట్టు సినిమాలో చూపించారని... వాస్తవానికి ఏ గర్భవతి కూడా జౌహార్ కు పాల్పడదని ఆయన అన్నారు. చిత్తోర్ గఢ్ కోటపై 55 ఏళ్ల వయసులో ఖిల్జీ దండెత్తితే... ఈ సినిమాలో 25 ఏళ్ల వయసులో దండెత్తినట్టు చూపించారని విమర్శించారు. చిత్తోర్ గఢ్ కోట ద్వారాన్ని ఖిల్జీ పగలగొట్టకపోయినా... పగలగొట్టినట్టు చూపించారని అన్నారు. చరిత్ర ప్రకారం కోట ద్వారాన్ని పెకిలించి తనతో పాటు ఢిల్లీకి ఖిల్జీ తీసుకుపోయినట్టు ఉందని చెప్పారు. 400 ఏళ్ల తర్వాత భరత్ పూర్ రాజు ఈ ద్వారాన్ని మళ్లీ తీసుకొచ్చి ప్రతిష్టించారని తెలిపారు. ఇలాంటి వక్రీకరణలు సినిమాలో చాలా ఉన్నాయని మండిపడ్డారు.