reliance jio: మరో అస్త్రాన్ని వదలనున్న రిలయన్స్ జియో!... రూ.1,500 కంటే చౌకకే 4జీ స్మార్ట్ ఫోన్
- ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ పై అభివృద్ధి
- త్వరలోనే లక్షలాది ఫోన్ల కోసం ఆర్డర్
- ప్రత్యర్థి కంపెనీల కంటే తక్కువ ధరకు అందించే వ్యూహం
టెలికం రంగంలో ప్రత్యర్థులకు తన మార్కెటింగ్ వ్యూహాలతో చుక్కలు చూపిస్తున్న రిలయన్స్ జియో మరో అస్త్రాన్ని వదలనుంది. ఇప్పటికే 4జీ ఫీచర్ ఫోన్ ను విడుదల చేసి, క్యాష్ బ్యాక్ ల ద్వారా దాన్ని దాదాపుగా ఉచితంగా అందిస్తున్న జియో... చాలా చౌక ధరకే 4జీ వోల్టే స్మార్ట్ ఫోన్ ను ఎల్ వై ఎఫ్ బ్రాండ్ కింద అందించే ప్రయత్నం మొదలు పెట్టింది.
తైవాన్ కు చెందిన చిప్ సెట్ తయారీ సంస్థ మీడియా టెక్ భాగస్వామ్యంతో దీన్ని సాకారం చేయాలనుకుంటోంది. టెలికం రంగంలో గతం నుంచి ఉన్న వొడాఫోన్, ఎయిర్ టెల్, ఐడియాలు రూ.1,500 స్థాయిలో 4జీ స్మార్ట్ ఫోన్ ను అందించే ఆఫర్లను ఇటీవలి కాలంలో తీసుకొచ్చాయి. అయితే, రిలయన్స్ ఇంత కంటే తక్కువ ధరకే అందిచనున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు తెలిపాయి. లక్షలాది ఫోన్ల కోసం త్వరలోనే జియో ఆర్డర్ కూడా ఇవ్వనున్నట్టు సమాచారం. ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ ఆధారంగా ఇది పనిచేయనుంది. ప్రారంభస్థాయి ఫీచర్ ఫోన్ల కోసం గూగుల్ ఆండ్రాయిడ్ గో ప్లాట్ ఫామ్ ను ప్రవేశపెట్టింది.