Uttar Pradesh: బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు యూపీ సర్కారు మంగళం... 1,000 చట్టాల రద్దుకు ప్రణాళిక!
- ఈ మేరకు జాబితా సిద్ధం
- బడ్జెట్ సమావేశాల్లో బిల్లు
- ఆ చట్టాలు ప్రాధాన్యం కోల్పోయాయన్న యూపీ న్యాయ మంత్రి
కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే, ఉత్తరప్రదేశ్ లో యోగీ సారధ్యంలోని బీజేపీ సర్కారు బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు మంగళం పాడనుంది. సుమారు 1,000 చట్టాలను రద్దు చేసే ప్రణాళికతో ఉంది. పాత కాలం నాటి, పనికిరాని చట్టాలతో ఓ జాబితాను రూపొందించింది. వీటిని రద్దు చేసే బిల్లును బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ఇటీవలి కాలంలో నూతన చట్టాలు, నిబంధనల రాకతో పాతవి ప్రాధాన్యం కోల్పోయాయని యూపీ న్యాయ శాఖా మంత్రి బ్రిజేష్ పాఠక్ తెలిపారు. ఈ తరహా చట్టాలను ఒకేసారి రద్దు చేసే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఇలానే కాలం చెల్లిన 245 చట్టాలను రద్దు చేసేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టగా, డిసెంబర్ లో వాటికి ఆమోదం లభించిన విషయం విదితమే.