cbi: సీబీఐ హామీతో దీక్ష విరమించుకున్న శ్రీజిత్... సోదరుడి మరణం గురించి 783 రోజుల దీక్ష!
- పోలీసుల కస్టడీలో మరణించిన శ్రీజిత్ సోదరుడు శ్రీజీవ్
- సీబీఐ విచారణ మీద నమ్మకంతో దీక్ష విరమించుకున్నట్లు ప్రకటన
- సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన శ్రీజిత్ దీక్ష అంశం
పోలీసుల కస్టడీలో మరణించిన తన సోదరుడు శ్రీజీవ్కి న్యాయం చేయాలంటూ కేరళ సెక్రటేరియట్ ముందు 783 రోజులుగా చేస్తున్న దీక్షను శ్రీజిత్ విరమించుకున్నాడు. సీబీఐ వారు చొరవ తీసుకోవడం, విచారణ పురోగతి సాధిస్తున్న కారణంగా తాను నిరసన దీక్ష విరమిస్తున్నట్లు శ్రీజిత్ పేర్కొన్నాడు. తిరువనంతపురం సీబీఐ కార్యాలయానికి తన తల్లి రేమణితో కలిసి వెళ్లి దీక్ష విరమిస్తున్నట్లు శ్రీజిత్ ప్రకటించాడు.
గత కొన్ని రోజులుగా శ్రీజిత్ నిరసన దీక్షకు కేరళ వ్యాప్తంగా విపరీత మద్దతు లభించింది. తన వంతు సాయంగా సంగీత దర్శకుడు గోపీ సుందర్ ఓ ప్రత్యేక గీతాన్ని కూడా విడుదల చేశారు. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు శ్రీజిత్ అంశాన్ని ట్రెండింగ్ చేశారు. దీంతో అతనికి సాయం చేసేందుకు సీబీఐ జనవరి 19న అంగీకరించింది.
అయితే విచారణ మీద స్పష్టత వచ్చిన తర్వాత దీక్ష విరమిస్తానని శ్రీజిత్ చెప్పాడు. అన్నట్లుగానే విచారణలో పురోగతి ఉండడంతో శ్రీజిత్ దీక్ష విరమించుకున్నాడు. 2014 మేలో దొంగతనం నేరం కింద శ్రీజిత్ సోదరుడు శ్రీజీవ్‌ను పారసాల పోలీసులు అరెస్టు చేశారు. వారి కస్టడీలో ఉండగా శ్రీజీవ్ మరణించాడు. విషం తీసుకుని శ్రీజీవ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. కానీ అందులో నిజం లేదని, పోలీసుల టార్చర్ వల్లే మరణించాడని ఆరోపణలు వచ్చాయి.