medaram: మేడారంలో ట్రాఫిక్ జామ్.. ఓ బాలింత మృతి!
- ఈరోజు తెల్లవారుజాము నుంచి స్తంభించిన ట్రాఫిక్
- ఎక్కడి వాహనాలు అక్కడే
- ప్రత్యేక హెలికాఫ్టర్ లో అక్కడికి చేరుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి
- ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన అంబులెన్స్..బాలింత మృతి
మేడారం జాతర ఈరోజు నుంచి ప్రారంభమైంది. తొలిరోజే భక్తులు పోటెత్తారు. అయితే, జాతరకు వెళ్లే నిమిత్తం నిన్న రాత్రి వాహనాల్లో బయలుదేరిన ప్రయాణికులు ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. ఈరోజు తెల్లవారుజాము మూడు గంటల నుంచి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవడంతో గంటల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
కాగా, మేడారంలో ట్రాఫిక్ అదుపు తప్పడంతో డీజీపీ మహేందర్ రెడ్డి రంగంలోకి దిగారు. ప్రత్యేక హెలికాఫ్టర్ లో ఆయన అక్కడికి చేరుకున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ అవడం, పోలీసుల మధ్య సమన్వయ లోపం ఏర్పడటంపై డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖుల సందర్శించనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డీజీపీ ఆదేశించారు.
కాగా, ఈ ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన ఓ బాలింత మృతి చెందిన విషాద సంఘటన చోటు చేసుకుంది. గర్భిణి కళాబాయి తమ కుటుంబంతో కలిసి జాతరకు వచ్చింది. ఆమెకు నొప్పులు రావడంతో ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలించగా మగబిడ్డకు జన్మనిచ్చింది. కళాబాయికి అధిక రక్తస్రావం కావడంతో వెంటనే ములుగు ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, ఆమెను తరలిస్తున్నఅంబులెన్స్ మేడారం ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. దీంతో, కళాబాయి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. సరైన సమయానికి వైద్యం అందకపోవడంతో ఆమె మృతి చెందింది.