Ramar Sethu: భారత్, శ్రీలంకల మధ్య రామసేతు వయసును తేల్చిన శాస్త్రవేత్తలు!
- 18,400 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన ఇది
- శిలాజాలను కార్బన్ డేటింగ్ విధానంలో విశ్లేషించిన అమెరికన్ సంస్థ
- ఇండియా, లంకల మధ్య 35 కిలోమీటర్ల వంతెన
- రామాయణ కాలంలో నిర్మించినదేనని నమ్మే భారతీయులు
రామసేతు... భారత్ లోని రామేశ్వరం, శ్రీలంకలోని మన్నార్ లను కలిపే వంతెన. ఇది రామాయణ కాలంలో సీతాన్వేషణ అనంతరం లంకపై యుద్ధానికి వెళ్లే శ్రీరామసైన్యం కోసం ఆంజనేయుని ఆధ్వర్యంలో వానరసేన నిర్మించిన వారధి అని అత్యధికులు నమ్ముతారన్న సంగతి తెలిసిందే. ఇక ఈ వతెనను ఎప్పుడు నిర్మించారన్న విషయాన్ని తేల్చేందుకు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఇన్ కాయిస్) శాస్త్రవేత్తలు రెండేళ్ల పాటు శ్రమించారు. ఈ సేతువు దగ్గర ఉన్న సముద్ర శిలాజాలను పరీక్షించాలని నిర్ణయించి, వాటి నమూనాలను అమెరికాలోని బీటా ఎనలిటిక్స్ కు పంపారు.సముద్ర గర్భంలో 600 మీటర్ల నుంచి కిలోమీటరు లోతులో ఈ వంతెన ఉండగా, సుమారు 35 కిలోమీటర్ల పొడవున ఉంది. ఈ వంతెనపై 75 సెంటీమీటర్ల నుంచి 130 సెంటీమీటర్ల లోతుకు తవ్వకాలు జరిపి, అక్కడ లభించిన సిబిసైడ్స్ ను కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా విశ్లేషిస్తే, ఇది 18,400 ఏళ్ల క్రితం నిర్మించినట్టు తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. మూడు ప్రాంతాల్లో నమూనాలను సేకరించి పరీక్షలు చేయించామని, ఇన్ కాయిస్ తో పాటు అన్నా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారని వెల్లడించారు.