Cricket: ఇక వన్డే యుద్ధం... భారత్-దక్షిణాఫ్రికా తొలి వన్డే నేడే!
- తొలి మూడు వన్డేలకు దూరమైన డివిలియర్స్
- పటిష్ఠమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్, సఫారీలు
- బౌలింగ్ వనరుల్లో పోటాపోటీగా ఉన్న టీమిండియా, సౌతాఫ్రికా
సౌతాఫ్రికాలో భారత జట్టు మరోసవాలుకి సిద్ధమైంది. టెస్టు సిరీస్ ఓటమికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. దీనికి తోడు చివరి టెస్టులో సఫారీలపై విజయం సాధించడం టీమిండియా ఆత్మవిశ్వాసం పెంచి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆరు వన్డేల సిరీస్ లో తొలి వన్డే నేడు డర్బన్ వేదికగా జరగనుంది.
కింగ్స్ మీడ్ స్టేడియంలో భారత జట్టు ప్రోటీస్ ను ఓడించాలని గట్టిపట్టుదలగా బరిలో దిగుతోంది. తొలి మూడు వన్డేలకు డివిలియర్స్ అందుబాటులో లేకపోవడం భారత్ కు కలిసి వచ్చే అవకాశమే. దీనిని బౌలర్లు ఎంత చక్కగా వాడుకుంటారో చూడాలి. ఇక టీమిండియా వన్డే జట్టు పూర్తి సన్నద్ధతతో బరిలో దిగుతోంది. టెస్టుల్లో విఫలమైన రోహిత్ శర్మ వన్డేల్లో రాణించి ఆకట్టుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు.
ధావన్ కూడా తానేంటో విదేశాల్లో రుజువు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. పేసర్లను ధాటిగా ఎదుర్కోవడం వీరి బలం కావడంతో టీమిండియాకు మంచి శుభారంభం లభిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదీకాక టెస్టుల్లోలా డిఫెన్స్ ఆడాల్సిన అవసరం కూడా తక్కువగా ఉండడంతో సహజ శైలిలో స్వేచ్ఛగా మరింత ధాటిగా ఆడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఇక రహానేను మూడో ఓపెనర్ గా పేర్కొంటున్నప్పటికీ మూడో నంబర్ లో కోహ్లీ ఫాంలో ఉన్నాడు. ఆ తరువాత కఠినమైన సఫారీ పిచ్ కు ఎదురొడ్డేందుకు రహానేను రంగంలోకి దించే అవకాశం కనబడుతోంది.
ఆ తరువాతి స్థానానికి మనిశ్ పాండే, శ్రేయస్ అయ్యర్, కేదార్ జాదవ్, హార్డిక్ పాండ్య, మహేంద్రసింగ్ దోనీ పోటీ పడుతున్నారు. వీరంతా ఈ స్థానంలో సమర్ధవంతంగా ఆడగలమని నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ ఎలాంటి జట్టుతో బరిలో దిగుతాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇక బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, బుమ్రా, షమీ, ఉమేష్ యాదవ్ లు మంచి దూకుడుమీదున్నారు. వారికి జతగా చాహల్ లేదా కుల్దీప్ యాదవ్ లలో ఒకరికి ఛాన్స్ లభించే అవకాశం ఉంది. వనరులు సమృద్ధిగా ఉన్న నేపథ్యంలో పటిష్ఠమైన జట్టుతో కోహ్లీ మైదానంలో దిగుతాడని వారు పేర్కొంటున్నారు.
దీంతో టెస్టు సిరీస్ ఓటమిపై వన్డే సిరీస్ గెలుపుతో టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందని సగటు అభిమానులు ఆశపడుతున్నారు. ఇక సఫారీలు కూడా బలంగా ఉన్నారు. బౌలింగ్ లో రబడా, మోర్కెల్, ఇమ్రాన్ తాహిర్ లు వణుకుపుట్టిస్తున్నారు. బ్యాటింగ్ లో అనుభవజ్ఞుడైన హసీమ్ ఆమ్లాకు జతగా, డుప్లెసిస్, డికాక్, డుమిని, మిల్లర్ ఆడనున్నారు. దీనికి తోడు సొంతగడ్డపై ఆడనుండడం ఆ జట్టుకు కలిసి వచ్చే అవకాశం. దీంతో టీమిండియాకు మరో చేదు అనుభవాన్ని మిగల్చాలని సఫారీ సేన భావిస్తోంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ సాయంత్రం 4:30 నిమిషాలకు ప్రారంభం కానుండగా, సోనీ, టెన్ 1, 3లలో ఇది ప్రత్యక్ష ప్రసారం కానుంది.