india u-13 cricket team: అండర్ 19 ఆటగాళ్లపై గంగూలీ ప్రశంసల జల్లు
- శుభ్ మన్ గిల్, ఇషాన్ పొరెల్, హార్విక్ భవిష్యత్ తారలంటూ కితాబు
- గిల్ ను బ్రియాన్ లారాతో పోల్చిన గంగూలీ
- భవిష్యత్ భారత క్రికెట్ వీరి చుట్టూ తిరుగుతుంది
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ సెమీఫైనల్లో సెంచరీతో సత్తాచాటిన శుభ్ మన్ గిల్ పై దిగ్గజ మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపిస్తూ, ప్రస్తుత అండర్ -19 సారథిగా ఉన్న పృథ్వీ షా కంటే శుభ్ మన్ గిల్ మెరుగైన ఆటగాడు అని భావిస్తున్నానని అన్నాడు. ఆ జట్టులోనే అతడు బెస్ట్ ప్లేయర్ అని పేర్కొన్నాడు.
విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ లా భవిష్యత్తులో గిల్ అద్భుత బ్యాట్స్ మెన్ అవుతాడని గంగూలీ జోస్యం చెప్పాడు. తన ఆట తీరుతో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకునే సామర్ధ్యం అతనిలో ఉందని ప్రశంసించాడు. బెంగాల్ ఆటగాడు ఇషాన్ పొరెల్ కూడా కొత్త బంతితో అద్భుతాలు చేస్తున్నాడని అభినందించాడు. టోర్నీ ఆరంభంలో గాయపడి, వారం తరువాత జట్టులోకి వచ్చి మంచి ప్రదర్శన చేశాడని కొనియాడాడు.
మిగిలిన ఆటగాళ్లతో పోలిస్తే వీరిద్దరూ ప్రత్యేకమని చెప్పాడు. వీరితో పాటు వికెట్ కీపర్ హార్విక్ దేశాయ్ కూడా చక్కని ఆటతీరు కనబరిచాడని చెప్పాడు. ఈ ముగ్గురి నుంచి టాప్ లెవల్ క్రికెట్ ప్రదర్శన చూడవచ్చని, భవిష్యత్ లో భారత క్రికెట్ వీరి చుట్టూనే తిరగొచ్చని గంగూలీ అభిప్రాయపడ్డాడు.