chattisgarh: మేడారం జాతరకు వచ్చిన చత్తీస్‌గఢ్ సీఎం.. సారలమ్మను దర్శించుకోకుండానే వెళ్లిపోయిన వైనం
- సమ్మక్కను దర్శించుకుని గద్దె వద్ద కాసేపు నిలబడ్డ రమణ్ సింగ్
- అదే సమయంలో కొబ్బరికాయలు విసిరిన భక్తులు
- అప్రమత్తమై సీఎంకు తగలకుండా కాపాడిన భద్రతాసిబ్బంది
- తృటిలో తప్పిన ప్రమాదం
ఆసియాలోనే అతి పెద్ద జాతరగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర రెండో రోజు కొనసాగుతోంది. ఈ రోజు చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వచ్చి సమ్మక్కను దర్శించుకున్నారు. ఆ సందర్భంగా సమ్మక్క గద్దెపైకి వచ్చి ఆయన కాసేపు అక్కడ ఉన్నారు. అయితే, సరిగ్గా అదే సమయంలో సంప్రదాయం ప్రకారం సమ్మక్క గద్దెపైకి భక్తులు కొబ్బరి కాయలు విసరడంతో కాసేపు గందరగోళం చెలరేగింది.
ముఖ్యమంత్రి భద్రతాసిబ్బంది వెంటనే అప్రమత్తం అవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. దీంతో సమ్మక్కను దర్శించుకున్న రమణ సింగ్ సారలమ్మను దర్శించుకోకుండానే వెళ్లిపోయారు. సీఎం రమణ సింగ్ ఆ సమయంలో వస్తున్నట్లు ముందే సమాచారం ఇచ్చినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వస్తున్నాయి. అక్కడ సీఎం ఉన్నప్పటికీ అధికారులు క్యూలైన్‌ను నిలిపివేయలేదు.
కాగా, రేపు సీఎం కేసీఆర్ మేడారం వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి, మధ్యాహ్నం 1.15 గంటలకు మేడారం చేరుకొని, 1.25 గంటలకు గద్దెల ప్రాంగణానికి వస్తారు. ఇరవై నిమిషాలపాటు అక్కడే ఉంటారు.