somireddy: మిత్రపక్షంగా నాలుగేళ్లు ఎదురు చూశాం: చంద్రబాబుతో సమావేశం తరువాత మంత్రి సోమిరెడ్డి
- రేపు, ఎల్లుండి పార్టీ నేతలతో చర్చించి ఓ కీలక నిర్ణయం తీసుకుంటాం
- కేంద్ర బడ్జెట్ నిరాశ కలిగించింది
- ఏపీ సమస్యలకు బడ్జెట్లో పరిష్కారం లభిస్తుందని ఆశించాం
- ప్రస్తుత బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే తీసుకురాలేదు
కేంద్ర బడ్జెట్ నిరాశ కలిగించిందని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి అధ్యక్షతన రాష్ట్ర మంత్రులు సమావేశం అయ్యారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ...ఏపీ సమస్యలకు బడ్జెట్లో పరిష్కారం లభిస్తుందని ఆశించామని, విభజన అన్యాయం నుంచి బయటపడాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఏపీకి ఏవో కొద్దిగా చేసి చాలా చేశామని ఇన్నాళ్లు చెప్పుకున్నారని అన్నారు. ప్రస్తుత బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే తీసుకురాలేదని అన్నారు.
బడ్జెట్లో రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూడలేదని, ఏపీ రాజధానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని సోమిరెడ్డి అన్నారు. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ తీరుపై చర్చిస్తామని, ఇతర నగరాలపై చూపించిన ప్రేమ అమరావతిపై చూపలేదని, ముంబయి, బెంగళూరుపై ఉన్న ప్రేమ అమరావతిపైనా చూపాల్సిందని అన్నారు. ఏపీకి న్యాయం చేస్తారని మిత్రపక్షంగా నాలుగేళ్లు ఎదురు చూశామని, రేపు, ఎల్లుండి పార్టీ నేతలతో చర్చించి ఓ కీలక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.