Virat Kohli: సెంచరీతో చెలరేగిన కోహ్లీ.. తొలి వన్డేలో భారత్ ఘన విజయం!

  • ఆరు వన్డేల సిరీస్‌లో 1-0తో భారత్ ఆధిక్యం
  • భారీ విజయ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన విరాట్ సేన
  • కెరీర్‌లో 33వ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ

టెస్టు సిరీస్ కోల్పోయి ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న భారత్ డర్బన్‌లో జరిగిన తొలి వన్డేలో ఇరగదీసింది. యువ బౌలర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్‌ల మణికట్టు మాయాజాలానికి కెప్టెన్ కోహ్లీ అద్భుత సెంచరీ తోడవడంతో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది.

దక్షిణాఫ్రికా నిర్దేశించిన 270 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ తొలి నుంచీ దూకుడుగానే ఆడింది. ఓపెనర్ రోహిత్ శర్మ (20) తొలి వన్డేలో విఫలం కాగా, మరో ఓపెనర్ శిఖర్ ధవన్ (35) పరవాలేదనిపించాడు. 67 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ కెరీర్‌లో 33వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 119 బంతుల్లో 10 ఫోర్లతో 112 పరుగులు చేసి జట్టును అలవోకగా విజయ తీరానికి చేర్చాడు. రహానే (79) కోహ్లీకి చక్కని సహకారం అందించాడు. వీరిద్దరి దెబ్బకు 45.3 ఓవర్లలోనే భారత్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఆరు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. 30 పరుగుల వద్ద హషీం ఆమ్లా (16) రూపంలో తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 83 పరుగుల వద్ద మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ (34) వికెట్‌ను కోల్పోయింది. అప్పటికి క్రీజులో కుదురుకున్న కెప్టెన్ డుప్లెసిస్ సెంచరీతో చెలరేగాడు. 112 బంతుల్లో 11  ఫోర్లు, 2 సిక్సర్లతో 120 పరుగులు చేసిన డుప్లెసిస్ కెరీర్‌లో 9వ సెంచరీ నమోదు చేశాడు. క్రిస్ మోరిస్ 37, అండిల్ ఫెహ్లుక్వాయో 27 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు 3, యుజ్వేంద్ర చాహల్‌కు రెండు వికెట్లు దక్కగా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రాలకు చెరో వికెట్ దక్కింది. ‘ప్లేయర్ ఆఫ్‌ ద మ్యాచ్’ అవార్డు కోహ్లీకి దక్కింది. సెంచూరియన్‌లో ఆదివారం రెండో వన్డే జరగనుంది.

  • Loading...

More Telugu News