Ram gopal varma: అవసరమైతే రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేస్తాం: సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ రఘువీర్
- జీఎస్టీపై కేసు నమోదు
- విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు
- స్పందించకుంటే అరెస్ట్ తప్పదన్న డీసీపీ
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేసినట్టు హైదరాబాద్ సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ రఘువీర్ తెలిపారు. ఇటీవల ఆయన రూపొందించిన ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. శృంగారం పేరుతో అశ్లీల చిత్రాన్ని నిర్మించారంటూ ఆర్జీవీపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసినట్టు రఘువీర్ పేర్కొన్నారు. కేసు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయనకు నోటీసులు పంపనున్నట్టు తెలిపారు. నోటీసులకు స్పందించకుంటే అవసరమైతే అరెస్ట్ చేస్తామన్నారు.
వర్మ రూపొందించిన ‘జీఎస్టీ’ని ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పించిన విమియా సంస్థ పోలీసుల ఆదేశాల మేరకు ఆ సౌకర్యాన్ని రద్దు చేసింది. కేవలం డబ్బులు చెల్లించి చూసే అవకాశాన్ని కల్పించగా, ఇప్పుడు ఆ సౌకర్యాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు విమియా తెలిపింది. ఈ మేరకు విమియా నుంచి తమకు అధికారిక లేఖ అందినట్టు డీసీపీ రఘువీర్ తెలిపారు.