aadhar case: సుప్రీంకోర్టులో నాటకీయ పరిణామం.. సారీ చెప్పిన న్యాయవాది!
- ఆధార్ కేసు విచారణ సందర్భంగా నాటకీయ పరిణామాలు
- నన్ను ఆధార్ జడ్జిగా పిలిచారన్న జస్టిస్ చంద్రచూడ్
- అలా పిలవలేదని చెబుతూనే, క్షమాపణ చెప్పిన న్యాయవాది
ఆధార్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అత్యంత కీలకమైన ఈ కేసు విచారణ సందర్భంగా, ఓ న్యాయవాది తీవ్ర స్వరంతో మాట్లాడటంతో, జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్రంగా స్పందించారు.
వివరాల్లోకి వెళ్తే, ఆధార్ చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ ను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోంది. ఆధార్ వల్ల సామాజిక ప్రయోజన పథకాల్లో తప్పుడు క్లెయిములను అడ్డుకోవచ్చని, తద్వారా అవినీతిపై ఉక్కుపాదం మోపవచ్చని కేంద్రం వాదిస్తోంది. ఈ సందర్భంగా న్యాయవాది శ్యామ్ దివాన్ మాట్లాడుతూ, ఆ గణాంకాలన్నీ తప్పని చెప్పారు. అయితే, బోగస్ లబ్ధిదారులను ఏరివేయడంలో ఆధార్ కీలక పాత్ర పోషించిందని, ప్రభుత్వ సోమ్మును ఆదా చేయడానికి ఉపయోగపడిందంటూ ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నివేదికను ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ ప్రస్తావించారు.
ఈ సందర్భంగా శ్యామ్ దివాన్ తన వాదను గట్టిగా వినిపిస్తుండటంతో... ఆధార్ జడ్జిగా తనపై ముద్ర వేసినా, తాను పట్టించుకోనని చంద్రచూడ్ అన్నారు. 'నేను ఆధార్ జడ్జి అనే భావనను మీరు పదేపదే కలగజేస్తున్నారు' అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీనికి సమాధానంగా, మిమ్మల్ని తాను ఎప్పుడూ అలా అనలేదని శ్యామ్ అన్నారు. లేదు... మీరు నన్ను అలాగే పిలిచారంటూ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. దీంతో, శ్యామ్ దివాన్ క్షమాపణ చెప్పారు.