raghuveera reddy: జగన్, చంద్రబాబు ఇద్దరూ మోదీకి దాసోహమయ్యారు... ఎంపీలంతా రాజీనామా చేయాలి: రఘువీరా వ్యాఖ్యలు
- ఒకరు బయట, ఒకరు లోపల బీజేపీకి మద్దతిస్తున్నారు
- ఆలస్యమైనా న్యాయం జరగాలంటే రాజీనామా చేసి రండి
- ప్రజాక్షేత్రంలోకి వస్తే కలసి ఉద్యమిద్దామని పిలుపు
వైఎస్ జగన్, సీఎం చంద్రబాబు ఇద్దరూ మోదీకి తోబుట్టువులని, మోదీకి దాసోహమయ్యారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు. ఒకరు కేంద్రంలో, రాష్ట్రంలోనూ బీజేపీతో అధికారాన్ని పంచుకుంటే, మరొకరు (జగన్) షరతుల్లేని మద్దతు ప్రకటించారని రఘువీరా గుర్తు చేశారు. ఈ మేరకు ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ఎంపీలంతా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం అందరం కలసి ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ‘‘లోక్ సభలో 25 ఎంపీలు ఈ రాష్ట్రానికి ఉన్నారు. వారంతా వెనువెంటనే రాజీనామా చేయాలి. ఈ రాష్ట్రానికి ఆలస్యమైనా వెంటనే న్యాయం జరగాలంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రండి. అందరం కలసి ఉద్యమిద్దాం. మాకెటువంటి భేషజాలు లేవు. చట్టప్రకారం, పార్లమెంటులో ఇచ్చినటువంటి హామీలు అమలుకావాల్సిందే’’ అని రఘువీరా అన్నారు.
మీ డ్రామాలు కట్టిపెట్టండంటూ టీడీపీ, వైసీపీకి ఆయన చురకలంటించారు. ‘‘జగన్ పార్టీ ఎంపీలు రాజీనామా చేయాలని టీడీపీ ఎంపీలు అడుగుతారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని జగన్ పార్టీ వారు అడుగుతారు. మీరిద్దరూ మోదీగారికి తోబుట్టువులే. ఒకరు లోపల, ఒకరు బయట బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రశ్నించరు. డీమోటినైజేషన్, జీఎస్టీ గురించి ప్రశ్నించారు. నల్లధనం తేలేదేమని ప్రశ్నించరు. పెట్రోల్ ధరలు పెరిగిపోతుంటే, రాజ్యంగాన్ని సమీక్షిస్తామంటే ప్రశ్నించరు’’ అని ఆ పార్టీల తీరును రఘువీరారెడ్డి తప్పుబట్టారు.