TTD: టీటీడీ వద్ద 45 టన్నుల విదేశీ నాణేలు: ఈవో అనిల్ కుమార్ సింఘాల్
- తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
- ఈ నెల 13, 20 తేదీల్లో వికలాంగులు, వయో వృద్ధులకు..14, 21 తేదీల్లో చంటి బిడ్డల తల్లులకు ప్రత్యేక దర్శనాలు
- శ్రీనివాసమంగాపురం, కపిలేశ్వర బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం : అనిల్ కుమార్ సింఘాల్
టీటీడీ వద్ద 45 టన్నుల విదేశీ నాణేలు ఉన్నట్టు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఈరోజు విడుదల చేసింది. అనంతరం, అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, మే నెలకు సంబంధించి 61,858 టికెట్లను భక్తుల కోసం అందుబాటులోకి తెచ్చామని అన్నారు.
టీటీడీ వద్ద విదేశీ నాణేల మార్పిడికి సంవత్సరాల తరబడి దేవస్థానం ప్రయత్నిస్తోందని చెప్పారు. టీటీడీ వద్ద ఉన్న విదేశీ నాణేలలో మలేసియాకు చెందిన నాణేలు 18 టన్నులు ఉన్నాయని, వీటిని త్వరలోనే మన దేశ కరెన్సీలోకి మారుస్తామని, అందుకు బ్యాంక్ లు ముందుకొచ్చాయని అన్నారు.
ఈ నెల 13, 20 తేదీల్లో వికలాంగులు, వయో వృద్ధులకు, 14, 21 తేదీల్లో చంటిబిడ్డల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తున్నామని, ఈ నెలలో జరిగే శ్రీనివాసమంగాపురం, కపిలేశ్వర బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. భక్తుల కోసం నడక మార్గంలో, ఘాట్ రోడ్డులో అనేక ఏర్పాట్లు చేస్తున్నామని, క్యూ కాంప్లెక్స్ లలో తోపులాటల నివారణకు మార్పులు తీసుకొచ్చామని తెలిపారు.
ఆన్ లైన్ లో లక్కీడిప్ లో సేవా టికెట్లు పొందేందుకు లక్ష మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, గత నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.83.84 కోట్లు లభించిందని చెప్పారు. ఆనంద నిలయం- అనంత స్వర్ణమయం ప్రాజెక్టు కోసం సమర్పించిన బంగారాన్ని కొంత మంది దాతలు వెనక్కి తీసుకుంటున్నారని చెప్పిన సింఘాల్, భక్తులకు ఇబ్బందులు తలెత్తితే టీటీడీ టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు.