NTR: అమరావతిలో 108 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం.. నాలుగు ఆకృతులను పరిశీలించిన చంద్రబాబు
- నీరుకొండపైన రాజధానికి అభిముఖంగా ఏర్పాటు
- వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి పూర్తిస్థాయి ఆకృతులను సిద్ధం చేయాలని ఆదేశం
- కొండపై ఎన్టీఆర్ స్మారక కేంద్రం, ప్రదర్శనశాల
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అత్యంత ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. నీరుకొండ కొండపైన రాజధాని వైపు చూసేలా 108 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం కొండపైనే ఎన్టీఆర్ స్మారక కేంద్రం, కన్వెన్షన్ కేంద్రాలు, గ్రంథాలయాలు, ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన ప్రదర్శనశాలను కూడా ఏర్పాటు చేయనుంది. కాగా, ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు ఆకృతులను శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పరిశీలించారు. వాటికి మరింత మెరుగులు దిద్ది వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలుత కృష్ణా నది ఒడ్డున కోర్ క్యాపిటల్‌కు అభిముఖంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడా నిర్ణయాన్ని విరమించుకుని నీరుకొండ వైపు ఏర్పాటు చేయాలని మంత్రివర్గంలో తీర్మానించారు. విగ్రహం ఎదుట భారీ జలాశయం ఉండడంతో విగ్రహం నీడ నీటిలో ప్రతిబింబించనుంది.