Australia under-19: ఆసీస్ ఆలౌట్... బౌలింగ్, ఫీల్డింగ్ లో భారత్ అండర్-19 మెరుపులు!
- 47.2 ఓవర్లకు ఆలౌటైన ఆస్ట్రేలియా అండర్-19
- భారత్ విజయ లక్ష్యం 217 పరుగులు
- సమష్టిగా రాణించిన బౌలర్లు
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ అండర్-19 ఆటగాళ్లు బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో రాణించి ఆకట్టుకున్నారు. భారత బౌలర్లు ఆసీస్ బ్యాట్స్ మన్ పై అద్భుత బంతులతో రాణించారు. నాగర్ కోటి, ఇషాన్ పొరెల్, శివ సింగ్, రాయ్ తలో రెండు వికెట్లు తీసి సమష్టిగా రాణించగా, శివమ్ మావి ఒక వికెట్ తీసి ఆకట్టుకున్నాడు. బౌలర్లలో అభిషేక్ సింగ్ ఒక్కడికే వికెట్ దక్కకపోవడం విశేషం.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఓపెనర్లు ఎడ్వర్డ్స్ (24), బ్రయాంట్ (14), సంఘ (13) లు ఆకట్టుకోగా, మెర్లొ (79), ఉప్పల్ (36) ఆసీస్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. అనంతరం వచ్చిన స్వీనీ (23) ఫర్వాలేదనిపించాడు. అనంతరం భారత అండర్-19 బౌలర్ల విజృంభణ మొదలైంది. సదర్లాండ్ (5), హాల్ట్ (13), ఇవాన్స్ (1), హాడ్లీ (1) లను త్వరగా పెవిలియన్ కు పంపారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 47.2 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌట్ అయింది.