Union Budget 2018-19: బీజేపీ ఎంపీల్లో బడ్జెట్ కలవరం.. మోదీ మాట్లాడుతున్నా కనపడని స్పందన!
- కేంద్ర బడ్జెట్ పై బీజేపీ ఎంపీల్లో కనిపించని ఉత్సాహం
- మోదీ, జైట్లీలు చెబుతున్నా కనిపించని ఆసక్తి
- జనాల్లోకి ఎలా వెళ్లాలంటూ మథనం
అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ పై విపక్షాలే కాకుండా, తెలుగుదేశం వంటి మిత్రపక్షాలు కూడా పెదవి విరిచాయి. బడ్జెట్ లో ఏపీకి ఇచ్చింది ఏమీ లేదంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే కామెంట్ చేశారు. మరోవిషయం ఏమిటంటే... ఈ బడ్జెట్ బీజేపీ ఎంపీల్లో సైతం గుబులు రేపుతోంది.
'మనది ప్రజలకు అనుకూలమైన బడ్జెట్. నియోజకవర్గ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లి, ఈ చారిత్రాత్మక బడ్జెట్ గురించి వివరించండి' అంటూ బీజేపీ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ చెబుతున్నప్పుడు... ఎంపీల్లో ఎలాంటి స్పందన కనిపించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. మోదీ ఏది చెప్పినా ఉత్సాహంతో హర్షం వ్యక్తం చేసే ఎంపీలు... బడ్జెట్ కు సంబంధించి మోదీ మాట్లాడుతున్నప్పుడు మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. బడ్జెట్ తర్వాత తమ ఎంపీల్లో అయోమయం పెరిగిపోయిందని, ప్రజల్లోకి ఎలా వెళ్లాలో కూడా అర్థంకాని స్థితిలో ఉన్నారని ఓ బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఎంపీలకు పార్లమెంటుకు వచ్చేందుకు కూడా ఆసక్తి లేకుండా పోయిందని తెలిపారు.
బడ్జెట్ పై అరుణ్ జైట్లీ ఎన్ని వివరణలు ఇచ్చినా, బీజేపీ ఎంపీలను మెప్పించలేకపోతోందని ఆ పార్టీ సీనియర్లు చెబుతున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే రాజస్థాన్ లో మూడు సిట్టింగ్ స్థానాలను బీజేపీ కోల్పోవడం... ఎంపీలకు మింగుడు పడటం లేదు. ఎన్డీఏ నుంచి టీడీపీ తప్పుకోనుందనే వార్తలు కూడా బీజేపీ నేతల్లో చర్చనీయాంశంగా మారాయి.