Padmaavat: 'పద్మావత్' అద్భుతమన్న రాజ్ పుత్ కర్ణి సేన... మరి ఆందోళనలు ఎందుకు చేశారు? అంటూ నెటిజన్ల నిలదీత
- 'పద్మావత్' సినిమాపై ప్రశంసలు కురిపించిన రాజ్ పుత్ కర్ణి సేన
- సినిమాపై ఆందోళనలు విరమించి, సినిమా ఆడేందుకు సహకరిస్తామంటూ ప్రకటన
- రాజ్ పుత్ సేన తీరుపై నెటిజన్ల ప్రశ్నలు
'పద్మావత్' సినిమా అద్భుతమని శ్రీ రాజ్ పుత్ కర్ణి సేన ప్రకటన చేసింది. 'ఇది రాజ్ పుత్ ల గౌరవం పెంచే సినిమా' అంటూ ప్రకటించి, ఈ సినిమాపై ఆందోళనలను విరమించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దాని వివరాల్లోకి వెళ్తే... ముంబైలో పలువురు కర్ణిసేన నేతలు 'పద్మావత్' సినిమాను వీక్షించారు.
అనంతరం కర్ణిసేన ముంబై చీఫ్ యోగంద్ర సింగ్ కటార్ తమ సంస్థ తరపున మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలేవీ లేవు. రాజ్ పుత్ ల గురించి చాలా గొప్పగా చూపించారు. పద్మావత్ చూశాక ప్రతీ రాజ్ పుత్ గర్వపడతారు. రాణి పద్మినీ, ఖిల్జీ మధ్య ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవు. రాజ్ పుత్ ల మనోభావాలను ఈ సినిమా దెబ్బతీయలేదు. పైగా చాలా గొప్పగా చూపించారు. అందుకే ఆందోళనలు విరమిస్తున్నాం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలతోపాటు మిగతా చోట్ల కూడా ఈ సినిమా ఆడేందుకు సహకరిస్తా’’మని ప్రకటించారు.
కాగా, సినిమా విడుదలపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ షరతులకు అంగీకరించి, సినిమా పేరు మార్చినప్పటికీ రాజ్ పుత్ కర్ణి సేన ఆందోళనలు, నిరసనలు, అల్లర్లు రేపిన సంగతి తెలిసిందే. దీపిక, భన్సాలీల తలలకు వెల కట్టింది. భన్సాలీ తల్లిపై సినిమా తీస్తామని వార్నింగ్ ఇచ్చింది. సినిమా విడుదలై విజయవంతమై వంద కోట్ల వసూళ్లు సాధించిన తరువాత యూటర్న్ తీసుకుని సినిమా సూపర్ అని ప్రకటించింది.