joopally: బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో చర్చ
- వచ్చే ఆర్థిక సంవత్సరంలో కావలసిన నిధులపై వాస్తవ ప్రతిపాదనలే రూపొందించాలి
- మూస పద్ధతికి దూరంగా అవసరమైన నిధులను కోరుదాం
- రోడ్ కనెక్టివిటీ లేని గ్రామాలకు నిధులు కోరాలి
వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అవసరమైన రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను వాస్తవిక దృక్పథంతో పక్కాగా రూపొందించాలని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. సచివాలయంలో 2018–19 బడ్జెట్ ప్రతిపాదనలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సెర్ప్, ఇంజనీరింగ్ అధికారులతో ఈ రోజు ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖలు రూపొందించిన ప్రతిపాదనలపై చర్చించారు. 2017 – 18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రావలసిన బకాయిలు, 2018 – 19 లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకోసం ఎన్ని నిధులు అవసరమో ప్రతిపాదనల్లో పొందుపరచాలని అన్నారు.
ఆసరా పెన్షన్లు, ఆపద్భాందు పథకం, ఉపాధిహామీ లాంటి కార్యక్రమాలకు అవసరమయ్యే నిధులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రధానంగా గ్రామీణ రోడ్లకు ప్రతిపాదనల్లో పెద్ద పీట వేయాలని, రోడ్డు కనెక్టివిటీ లేని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు ఎన్ని నిధులు అవసరమో పక్కాగా బడ్జెట్ ప్రతిపాదనల్లో పొందుపరచాలని ఆదేశించారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న కార్యక్రమాలను పూర్తి చేసేందుకు ఎన్ని నిధులు కావాలో కూడా అంచనా వేసుకొని ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.
గతేడాది కన్నా ప్రతిపాదనలు ఎక్కువ చూపాలనే ఆలోచనతో కాకుండా వాస్తవిక దృక్పథంతో, అభివృద్ధి పనుల్లో వేగం పెంచేందుకు దోహదపడేలా ప్రతిపాదనలు ఉండాలని జూపల్లి కృష్ణారావు సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, సెర్ప్ సీఈఓ పౌసమీ బసు, ఈఎన్సీ సత్యనారాయణ రెడ్డి, అధికారులు రామారావు, సైదులు తదితరులు పాల్గొన్నారు.