syria: సిరియన్ ఉగ్రవాదుల దారుణం.. రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసి, పైలట్ ను కాల్చి చంపారు!
- సిరియా ఉత్తర ఇడ్లిబ్ ఫ్రావిన్స్ లో సంఘటన
- షోల్డర్-ఫైర్డ్ మిసైల్ తో కూల్చివేత
- ప్యారాచూట్ సాయంతో కిందకు దిగిన పైలట్ ను కాల్చివేసిన హెచ్ టీఎస్ ఉగ్రవాదులు
రష్యాకు చెందిన ఓ యుద్ధ విమానాన్ని ఉగ్రవాదులు కూల్చివేసి, అందులోని పైలెట్ ను కాల్చి చంపేసిన దారుణ సంఘటన సిరియాలో జరిగింది. సిరియా ఉత్తర ఇడ్లిబ్ ఫ్రావిన్స్ లో నిన్న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు. రష్యాకు చెందిన ఎస్ యూ-25 యుద్ధ విమానాన్ని షోల్డర్-ఫైర్డ్ మిసైల్ (భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణి)ని ఉపయోగించి హయత్ తెహ్రిర్ అల్ - ష్యామ్ (హెచ్ టీఎస్) అనే ఉగ్రవాద సంస్థ నేలకూల్చింది.
ప్యారాచూట్ సాయంతో కిందకు దిగిన అందులోని పైలట్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. కాగా, ఈ ఘటనను రష్యా రక్షణ శాఖ ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన చేసింది. తమ యుద్ధవిమానాన్ని సిరియన్ తిరుగుబాటుదారులు నేలకూల్చారని పేర్కొంది. పోర్టబుల్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ తో విమానాన్ని కూల్చినట్టు తెలుస్తోందని రష్యా ఏజెన్సీలు పేర్కొన్నాయి. ఈ యుద్ధవిమానాన్ని కూల్చి వేసింది తామే నంటూ హెచ్ టీఎస్ పేర్కొంది. ఇడ్లిబ్ ప్రాంతంలో రష్యా దాడులకు వ్యతిరేకంగానే ఈ విమానాన్ని కూల్చివేసినట్టు తెలిపింది.