Arun Jaitley: ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన అరుణ్ జైట్లీ
- ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతున్నట్టు వార్తలు
- అదేం లేదన్న కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ
- ‘జమిలి’ ఎన్నికల గురించి మాత్రమే మాట్లాడామన్న మంత్రి
ముందస్తు ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఎడతెగని చర్చ జరుగుతోంది. ఇటీవల రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ కూడా ‘ఒకేసారి’ ఎన్నికల గురించి ప్రస్తావించారు. దీంతో రాజకీయ పార్టీల్లో ‘ముందస్తు’ వేడి రగులుకుంది. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉందన్న వార్తలు కూడా వినిపించాయి. దీంతో స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ఈ విషయమై స్పష్టత ఇచ్చారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని, అటువంటి ఆలోచన తమకు లేదని తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలని మాత్రమే తాము కోరుకుంటున్నాం తప్పితే ముందస్తును కోరుకోవడం లేదని కుండబద్దలు కొట్టారు. అలాగే ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ ఎన్నికలను వాయిదా వేసే ఉద్దేశం కూడా తమకు లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ అలా జరగాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని, కాబట్టి అటువంటి ఆలోచన కేంద్రానికి లేదని జైట్లీ స్పష్టం చేశారు.