North Korea: బెర్లిన్ నుంచే ఉత్తర కొరియాకు అణ్వాయుధ టెక్నాలజీ: జర్మనీ ఇంటెలిజెన్స్
- బెర్లిన్లోని ఆ దేశ ఎంబసీ నుంచే సేకరణ
- వెల్లడించిన జర్మనీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్
- అణ్వాయుధాలు, బాలిస్టిక్ మిసైళ్ల తయారీకి దానిని ఉపయోగిస్తున్న ఉత్తర కొరియా
అణ్వాయుధ పరీక్షలతో ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న ఉత్తరకొరియాకు అసలా సాంకేతికత ఎలా వచ్చిందన్న ప్రశ్నకు సమాధానం లభించింది. బెర్లిన్లో ఉన్న నార్త్కొరియా ఎంబసీ నుంచి ఈ టెక్నాలజీని సమకూర్చుకుందని జర్మనీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ హాన్స్-జార్జ్ మాసెన్ పేర్కొన్నారు. సేకరించిన సాంకేతికతతో అణ్వాయుధాలు, బాలిస్టిక్ మిసైళ్ల తయారీ కోసం ఉపయోగించుకుంటోందని తెలిపారు.
‘‘బెర్లిన్ ఎంబసీ నుంచి నార్త్ కొరియా అణ్వాయుధ సాంకేతికతను సేకరించినట్టు మా దృష్టికి వచ్చింది. దీనిని పౌర అవసరాలకు, మిలటరీ అవసరాల కోసం కూడా ఉపయోగించవచ్చు’’ అని ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. నేడు ఈ ఇంటర్వ్యూ ప్రసారం కానుంది.
ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. టెక్నాలజీని వారు సొంతం చేసుకుంటున్నారని తెలిస్తే ఆప గలిగి ఉండేవాళ్లమని, అయితే వాళ్ల ప్రయత్నాలను ప్రతిసారీ అడ్డుకోవడం కష్టమని మాసెన్ పేర్కొన్నారు. అణ్వాయుధ టెక్నాలజీని నార్త్ కొరియా సంపాదించినట్టు 2016, 2017లో జర్మనీ ఎజెన్సీ కొన్ని ఆధారాలను సంపాదించింది.