Amit Shah: అమిత్‌షాకు అది తప్ప మరేమీ తెలియదు.. విరుచుకుపడిన సిద్ధరామయ్య
- ఆయనకు తెలిసిన విద్య మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడమే
- మోదీ అలా చేస్తారని నేను భావించడం లేదు
- ప్రధాని పర్యటన వల్ల మాకొచ్చే నష్టం లేదు
- కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు. మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం తప్ప అమిత్ షాకు మరేమీ తెలియదని, అదే ఆయన సిద్ధాంతమని ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో మత ఘర్షణలు ప్రేరేపించడానికి ఎవరు ప్రయత్నించినా మేం అడ్డుకుంటాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించేవారిని కఠినంగా శిక్షిస్తాం’’ అని సిద్ధరామయ్య హెచ్చరించారు.
ప్రధాని నరేంద్రమోదీ మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొడతారని తాను భావించడం లేదని, కానీ అమిత్ షా సిద్ధాంతం మాత్రం అదేనని అన్నారు. అది తప్ప ఆయనకు మరో విషయం తెలియదని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. దానిని ఆయన రాజకీయ వ్యూహంగా భావిస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ప్రధాని మోదీ బెంగళూరు పర్యటన, ర్యాలీ నిర్వహించడం వల్ల తమకొచ్చిన ముప్పేమీ లేదని తేల్చి చెప్పారు. ‘‘బీజేపీ ఓ రాజకీయ పార్టీ. మోదీ దేశానికి ప్రధాని. కాబట్టి ఆయన తన పార్టీకి ఓట్ల కోసం ఇక్కడికొచ్చారు. అంతే తప్ప కర్ణాటకపై ఆయన ప్రభావం ఏమాత్రం ఉండబోదు’’ అని సిద్ధరామయ్య తేల్చి చెప్పారు.
బీజేపీ అబద్ధాలు చెబుతూ, ఇతరులను విమర్శిస్తూ పబ్బం గడుపుకుంటోందని సీఎం విమర్శించారు. సిద్ధరామయ్యది అణచివేత, హానికారక, అవినీతి ప్రభుత్వమని షా విమర్శించిన నేపథ్యంలో సిద్ధరామయ్య ఇలా విరుచుకుపడ్డారు.