Pad Man: మేం సినిమాలు మాత్రమే విడుదల చేస్తాం.. అణ్వాయుధాలను కాదు: ‘ప్యాడ్‌మ్యాన్’ డైరెక్టర్
- సినిమాలను విభజించడం మానుకోండి
- సినిమా ఎప్పుడూ ఊహాజనితమే.. దానికంత ప్రాధాన్యత అవసరం లేదు
- ప్రపంచాన్ని మార్చే శక్తి సినిమాలకు ఉంటే అందరూ అదే పనిచేస్తారు
- ప్యాడ్‌మ్యాన్ డైరెక్టర్ ఆర్.బాల్కి
సినిమాలకు ఎందుకంత ప్రాధాన్యం ఇస్తారో తనకు తెలియదని, తాము సినిమాలు మాత్రమే విడుదల చేస్తామని, అణ్వాయుధాలను కాదని ‘ప్యాడ్‌మ్యాన్’ డైరెక్టర్ ఆర్.బాల్కి అన్నారు. అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్, రాధిక ఆప్టే నటించిన ఈ సినిమా విడుదలకు ముందే ప్రకంపనలు సృష్టిస్తోంది. సినిమాలు నిర్మించడంలో సామాజిక బాధ్యత ఉంటుందని తాను భావించడం లేదని, సినిమా ఎప్పుడూ సినిమా మాత్రమేనని పేర్కొన్నారు. అయితే వినోదాత్మక సినిమాలు, లేదంటే బోరు కొట్టించే సినిమాలు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు.
బాలీవుడ్ రెండు దశాబ్దాలుగా బాధ్యతాయుతమైన, అందమైన సినిమాలు తీస్తోందని ఇప్పటికీ వాటినే గుర్తిస్తే సరిపోతుందని అన్నారు. సినిమాలు సమాజాన్ని కాకుండా ఆర్థిక (ఎకనమిక్స్) పరిస్థితిని మాత్రమే మారుస్తాయని స్పష్టం చేశారు. సినిమాలకు ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంటే ప్రపంచంలో అందరూ సినిమాలు తీస్తూ కూర్చుంటారని బాల్కి అన్నారు. కాబట్టి సినిమాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
సినిమాలు ఎప్పుడూ ఊహాజనితంగానే నిర్మితమవుతుంటాయని పేర్కొన్నారు. తాము సినిమాలు మాత్రమే విడుదల చేస్తామని, అణ్వాయుధాలను కాదని బాల్కి వివరించారు. కాగా, ‘ప్యాడ్‌మన్’ సినిమాను ఓ వ్యక్తి జీవితగాథ ఆధారంగా రూపొందించారు.