KVP Ramachandra Rao: నన్నెవరూ ఆదేశించలేరు: కేవీపీ తీరుపై వెంకయ్యనాయుడి ఆగ్రహం
- లోక్ సభలో కొత్త ఎంపీల ప్రమాణస్వీకారం
- రాజ్యసభలో కొనసాగిన రభస
- పోడియంలో కేవీపీ నిరసన
- వెంకయ్యనాయుడి తీవ్ర ఆగ్రహం
ఈ ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తరువాత లోక్ సభలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంటే, రాజ్యసభలో మాత్రం గందరగోళం కొనసాగింది. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్లకార్డు పట్టుకుని పోడియంలోకి వెళ్లి, తన నిరసనను తెలుపుతుంటే, ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ సభ్యులు నినాదాలతో సభను హోరెత్తించారు. రాజ్యసభ అధ్యక్ష స్థానంలో ఉన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎంతగా సర్దిచెప్పాలని చూసినా, పరిస్థితి అదుపులోకి రాలేదు.
ఈ సమయంలో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన, "మీకు ప్రశ్నోత్తరాల సమయం వద్దా? సభలో ఇలాగేనా ప్రవర్తించేది? దయచేసి వెనక్కు వెళ్లండి. ఇక్కడ కూర్చుని ఏం చేయాలో నన్నెవరూ ఆదేశించలేరు. సభను నడిపించాలన్న ఉద్దేశం మీకు లేదా? పరువు తీస్తున్నారు. యూ కెనాట్ డిక్టేట్ మీ. మీరు చెప్పేదేదీ రికార్డుల్లోకి ఎక్కదు. ఇలాగే చేస్తే మధ్యాహ్నం వరకూ సభను వాయిదా వేస్తాను.
మిస్టర్ రామచంద్రరావ్, ప్లీజ్ గో టూ యువర్ సీట్. ప్రజా సంక్షేమంపై మీకు శ్రద్ధ లేదా? కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నారు. నేను దీన్ని అంగీకరించను" అని అంటూ సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, ప్రత్యేక హోదాపై వైసీపీ సైతం నేడు రాజ్యసభలో నోటీసులు ఇచ్చింది. హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ, స్వల్పకాలిక చర్చకు అనుమతించాలని కోరగా, స్పీకర్ దాన్ని తిరస్కరించారు. కేవీపీకి మద్దతుగా కాంగ్రెస్, వైకాపా ఎంపీలు నినాదాలు చేస్తుండటంతో రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది.