Chittor MP Siva Prasad: 'అలుగుటయే ఎరుంగని... వార్ విల్ బీ డిక్లేర్డ్': పార్లమెంట్ ముందు చిత్తూరు ఎంపీ శివప్రసాద్
- నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ పై నిమ్మకు నీరెత్తినట్టున్న కేంద్రం
- చంద్రబాబునాయుడి సహనానికి హద్దుంది
- ఆయన అలిగితే పరిస్థితి విషమిస్తుంది
- అప్పుడిక యుద్ధం ప్రకటిస్తాం: శివప్రసాద్
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ఎంతగానో నష్టపోయిందని, నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యతగల కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుందని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మండిపడ్డారు. కొద్దిసేపటి క్రితం పార్లమెంట్ ఉభయసభలు వాయిదా పడిన తరువాత తెలుగుదేశం ఎంపీలతో కలసి ఆయన గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. విభజన చట్టాన్ని అమలు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన శివప్రసాద్, "సార్... చంద్రబాబునాయుడి సహనానికి ఓ హద్దుంటుంది. అలుగుటయే ఎరుంగని చంద్రబాబునాయుడే అలిగిన రోజు పరిస్థితులు విషమిస్తాయి. అంతదూరం తీసుకు రావద్దండీ. తిరుపతిలో వెంకన్న సాక్షిగా మోదీగారూ... మీరు అనేక ప్రామిస్ లు చేశారు. ఒక్క ప్రామిస్ కూడా నెరవేర్చలేదు. కాబట్టి దయచేసి ఇన్ వాల్వ్ కండి. మీరు ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతృప్తి పడే సమాధానం ఇవ్వండి. లేకపోతే వార్ విల్ బీ డిక్లేర్డ్" అని హెచ్చరించారు.