Supreme Court: మేజర్ల వివాహం విషయంలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదు: సుప్రీంకోర్టు
- ఏ ఒక్కరికీ, సమాజానికీ హక్కు లేదన్న కోర్టు
- పరువు హత్యలపై విచారణ సందర్భంగా వ్యాఖ్యలు
- దంపతుల హక్కులపైనే తమ ఆందోళన అని స్పష్టం
చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఓ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. వధూవరులు ఇద్దరూ మేజర్లయితే వారి వివాహం విషయంలో వారి ఇష్టానికి వ్యతిరేకంగా జోక్యం చేసుకునే హక్కు తల్లిదండ్రులతోపాటు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. పరువు హత్యలపై ఓ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది.
‘‘అది తల్లిదండ్రులు కానీయండి. లేదా సమాజం లేదా ఎవరైనా సరే, వారంతా బయటివారే. ఎవరైనా కానీ, వ్యక్తి కానీ, సమూహం కానీ, ఒకరి వివాహం విషయంలో కల్పించుకునే హక్కు లేదు’’ అని స్పష్టం చేసింది. శక్తివాహిని అనే లాభాపేక్ష రహిత సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది.
ఖాప్ పంచాయతీలు లేదా గ్రామ కోర్టులపై నిషేధం విధించాలని కోరింది. హర్యానా తదితర రాష్ట్రాల్లో తమ కుటుంబ సభ్యుల ఇష్టాలకు వ్యతిరేకంగా వివాహం చేసుకున్న వారిని శిక్షించే విధానాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ‘‘ఖాప్ పంచాయత్ గురించి మాకు ఆందోళన లేదు. వివాహం చేసుకునే దంపతుల హక్కులపైనే ఆందోళన’’ అని ధర్మాసనం పేర్కొంది.