eli diaghilev: అమ్మాయిల అందాల పోటీల్లో ఫైనల్స్ కు చేరిన అబ్బాయి... చివర్లో షాక్!
- 2018 మిస్ వర్చ్యువల్ కజకిస్తాన్ అందాల పోటీ ఫైనలిస్ట్ గా ఎంపికైన ఎలీ డయాగ్లెవ్
- ఫైనల్స్ ముందు తాను అబ్బాయినని ప్రకటించిన ఎలీ డయాగ్లెవ్
- స్నేహితులతో తన వాదన నిజమని నిరూపించేందుకు అమ్మాయిలా మారిన డయాగ్లెవ్
2018 మిస్ వర్చ్యువల్ కజకిస్తాన్ అందాల పోటీ ఫైనలిస్ట్ అయిన అరినా (22) అందానికి కజికిస్థాన్ కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. అందాల కిరీటం ఆమెదేనని అంతా భావించారు. అయితే, ఇక్కడే ఎవరూ ఊహించని ట్విస్ట్ వచ్చింది. చివరి అంచె పోటీలు మొదలు కావడానికి ముందు తన సోషల్ మీడియా అకౌంట్ లో తాను అమ్మాయిని కాదని, అబ్బాయినని చెబుతూ ఎలీ డయాగ్లెవ్ (అరినా అసలు పేరు) ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో తానెందుకు అమ్మాయిల అందాల పోటీల్లో పాల్గొనాల్సి వచ్చిందో తెలిపాడు.
ఎలీ డయాగ్లెవ్ ఒక మోడల్.. ఓ రోజు తన ఫ్రెండ్స్ తో కాఫీ షాపులో కూర్చుని ఉండగా, వారి మధ్య అమ్మాయిల సౌందర్యంపై ఒక చర్చ మొదలైంది. ఒకప్పుడు మహిళలు అంతర్గత సౌందర్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారని, దీంతో ఉన్నత వ్యక్తిత్వంతో ఉండేవారని, ఆధునిక మహిళలు బాహ్యసౌందర్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, దీంతో వ్యక్తిత్వం కోల్పోయి, ట్రెండ్ ఎటు ఉంటే అటు పోతున్నారని వాదించాడు.
ఫ్యాషనబుల్ గా దుస్తులు ధరించడం, మేకప్ వేసుకుంటే చాలు, తాము అందంగా ఉంటామని అనుకుంటున్నారని పేర్కొన్నాడు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక పద్ధతులతో ఓ మగాడు కూడా అందమైన మహిళగా మారిపోవచ్చని అన్నాడు. అతని వాదనను అతడి స్నేహితులు వ్యతిరేకించారు. అయితే తన వాదన సరైనదేనని నిరూపించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో మేకప్ ఆర్టిస్టు సాయం తీసుకున్నాడు. ఎలీ కాస్తా అందమైన అరినాగా మారిపోయాడు.
వర్చ్యువల్ కజకిస్తాన్ అందాల పోటీలో భాగంగా ఆన్ లైన్లో తన ఫొటోలను పెట్టాడు. తన ఫొటోలకు నెటిజన్ల స్పందన అదిరిపోయింది. దీంతో ఈ పోటీల్లో ఫైనలిస్టుగా ఎంపికయ్యాడు. తన మాట నెగ్గింది. ఇక నిజం చెప్పాల్సిన టైమొచ్చిందని భావించిన ఎలీ తాను అమ్మాయిని కాదని, తన పేరు కూడా అరినా కాదని చెబుతూ ఒక వీడియో పోస్టు చేసి, ‘కొంత మంది అమ్మాయిలు ఈ మధ్య బాహ్య సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఆ బాహ్య సౌందర్యాన్ని ఓ మగాడు కూడా సాధించగలడు. వ్యక్తిత్వం, అంతః సౌందర్యం అన్నవి అన్నింటికన్నా ముఖ్యం. నా ఈ పని కొంతమందైనా అమ్మాయిలను ఆ దిశగా ఆలోచించేలా చేస్తుందని భావిస్తున్నాను’ అంటూ పేర్కొన్నాడు. దీంతో అంతా షాకయ్యారు. ఇక అతని ఫొటోలు చూసి ప్రేమలో పడిన అబ్బాయిలు మాత్రం విషాదగీతాలు పాడుకుంటున్నారు.