Donald Trump: ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ట్రంప్ లైంగిక వేధింపుల బాధితురాలు!
- లిఫ్ట్ లో రచెల్ తో అసభ్యంగా ప్రవర్తించిన ట్రంప్
- బలవంతంగా ముద్దు పెట్టుకున్నారు
- స్టేట్ లెజిస్లేచర్ ఎన్నిక బరిలో రచెల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వారిలో ఒకరైన రచెల్ క్రూక్స్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ట్రంప్ కంచుకోటగా భావించే ఓహియో నుంచి స్టేట్ లెజిస్లేచర్ అభ్యర్థిగా ఆమె పోటీ చేయబోతున్నారు. ప్రస్తుత పాలనతో అమెరికన్లు కలత చెందుతున్నారని, వారి జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెప్పారు. వారి తరపును గొంతుకను వినిపించేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. గ్రామీణ జనాభా ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో గత అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ పై ట్రంప్ 61 శాతం ఓట్లతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే, డెమోక్రాటిక్ పార్టీ ఏరికోరి రచెల్ ను ఇక్కడ బరిలోకి దింపింది.
35 ఏళ్ల రచెల్ కు ఇక్కడ మంచి పేరు ఉంది. హైడెల్ బర్గ్ యూనివర్శిటీ ఐఎస్ఆర్ విభాగానికి ఆమె డైరెక్టర్ గా పని చేస్తున్నారు. విద్యా వ్యవస్థను మార్చేందుకు ఆమె చేసిన సంస్కరణలు మంచి ఫలితాన్నిచ్చాయి. 2005లో ట్రంప్ టవర్ లోని ఓ రియలెస్టేట్ కంపెనీలో రచెల్ రిసెప్షనిస్టుగా పని చేసేవారు. ఒకరోజు లిఫ్టులో ఆమెతో పాటు ట్రంప్ వెళ్లారు. ఆ సందర్భంగా తనను తాను పరిచయం చేసుకుని ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చారు.
ఆ తర్వాత బలవంతంగా ఆమె బుగ్గల మీద, అనంతరం పెదవులపై ముద్దు పెట్టుకున్నారు. తాను ఏమీ చేయలేననే భావనతోనే ట్రంప్ అలా ప్రవర్తించారని... అప్పుడు తనకు ఎంతో ఇబ్బంది అనిపించిందని... ఆ విషయం గురించి మాట్లాడుతూ రచెల్ చెప్పారు. ఆ తర్వాత తన ఫోన్ నంబర్ ను కూడా తీసుకున్నారని... అయితే ఆ తర్వాత తనకు ట్రంప్ నుంచి ఎలాంటి వేధింపులు ఎదురుకాలేదని ఆమె తెలిపారు.