Parliament: ఇరు సభలనూ కుదిపేస్తున్న ఏపీ ఎంపీలు... టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ సభ్యుల నినాదాల హోరు!
- నిరసన గళం విప్పిన ఏపీ ఎంపీలు
- హామీల అమలుకు డిమాండ్
- రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదా
- నినాదాల మధ్యే కొనసాగుతున్న లోక్ సభ
ఈ ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తరువాత అటు లోక్ సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు తమ నిరసనగళం విప్పారు. లోక్ సభలో విభజన హామీల అమలుపై తామిచ్చిన నోటీసు మీద స్వల్పకాలిక చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ, టీడీపీ ఎంపీలు తమ స్థానాల్లో లేచి నిలబడి నినాదాలు చేస్తున్నారు. వారి నినాదాల మధ్యే, ప్రశ్నోత్తరాలను ప్రారంభించిన స్పీకర్ సుమిత్రా మహాజన్, సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని పదే పదే కోరడం కనిపించింది.
లోక్ సభలో ఎంపీ సుబ్బారెడ్డి వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చి, దానిపై చర్చకు పట్టుబట్టారు. మరోవైపు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కాలింగ్ అటెన్షన్ నోటీస్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ కూడా ఏపీకి న్యాయం చేయాలన్న తన నిరసనను రాజ్యసభలో కొనసాగిస్తున్నారు. రాజ్యసభలో కేవీపీకి మద్దతుగా కాంగ్రెస్ ఎంపీలంతా నినాదాలు చేస్తుండటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో సభను మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. లోక్ సభ మాత్రం కొనసాగుతోంది.