Amaravati: అమరావతిలో మాయాజాలం... సెంటు భూమి ఇవ్వని వ్యక్తి భూమి ఇచ్చినట్టు చూపిన అధికారులు... కుంభకోణంపై బాబు సీరియస్!
- సంచలనం కలిగిస్తున్న భూ కుంభకోణం
- రికార్డులు మార్చిన సీఆర్డీయే అధికారులు
- నివేదిక ఇవ్వాలని ఆదేశించిన సీఎం
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నయా భూ కుంభకోణం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. సీఆర్డియే అధికారులు కుమ్మక్కై అమరావతికి సెంటు భూమి కూడా ఇవ్వని గౌస్ ఖాన్ అనే వ్యక్తి భూమి ఇచ్చినట్టు తప్పుడు రికార్డులను సృష్టించారు. అతనికి దాదాపు రూ. 3.50 కోట్ల మేరకు లబ్ది కలిగేలా రికార్డులను మార్చారు. అధికారుల మాయాజాలంతో రాజధానికి భూమి ఇవ్వకుండానే గౌస్ ఖాన్ ఎన్నో ప్రయోజనాలను పొందినట్టు ఉన్నతాధికారులు గుర్తించారు.
భూ సమీకరణలో భాగంగా ఆయన భూమి ఇచ్చినట్టు రికార్డులు మార్చిన ఘటన వెలుగులోకి రావడంతో, సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్ఠపై మచ్చ తెచ్చే ఇటువంటి ఘటనలపై తాను కఠినంగా ఉంటానని హెచ్చరించిన ఆయన, వెంటనే ఈ విషయమై తనకు నివేదిక సమర్పించాలని సీఆర్డీయే కమిషనర్ ను ఆదేశించారు. తప్పు చేసిన వారందరిపైనా చర్యలుంటాయని స్పష్టం చేశారు.