New Delhi: పీఎన్బీకి 280 కోట్లకు టోకరా వేసిన వజ్రాల వ్యాపారి... సీబీఐ కేసు!
- వజ్రాల వ్యాపారికి సహకరించిన ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు
- ఎలాంటి పూచీకత్తు, పత్రాలు లేకుండా 280.7 కోట్ల రుణం మంజూరు
- ఈ మొత్తానికి బ్యాంకులో రికార్డులు కనిపించకుండా చేసిన బ్యాంకు ఉద్యోగులు
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) కు కుట్రపూరితంగా తప్పుడు పత్రాలు సమర్పించి, 280.7 కోట్ల రూపాయల రుణం తీసుకున్న వజ్రాల వ్యాపారి, ఇద్దరు ఇంటి దొంగలు (బ్యాంకు ఉద్యోగులు) సహా ఆరుగురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. దాని వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీలో ప్రముఖ వజ్రాల వ్యాపారిగా పేరొందిన నిరవ్ మోదీ, ఆయన భార్య అమీ, సోదరుడు నిశాల్, మరో వ్యక్తి మెహుల్ చిన్నూభాయ్ చోక్సీలు డైమోన్ ఆర్ యూఎస్, సోలార్ ఎక్స్ పోర్ట్స్, స్టెల్లర్ డైమండ్స్ సంస్థలలో భాగస్వాములు.
ఈ నలుగురితో బ్యాంకు రిటైర్డ్ డిప్యూటీ మేనేజర్ గోకుల్ నాథ్, మరో అధికారి మనోజ్ కరత్ లు కుమ్మక్కై గత ఏడాది పంజాబ్ నేషనల్ బ్యాంకులో 280.7 కోట్ల రూపాయల రుణాన్ని ఎలాంటి పూచీకత్తు, నిర్ణీత పత్రాలు లేకుండా మంజూరు చేశారు. ఈ లావాదేవీలకు సంబంధించిన ఎలాంటి రికార్డు బ్యాంకు సిస్టమ్ లో లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనిని గుర్తించిన ఉన్నతాధికారులు రికార్డులు పరిశీలించగా ఇంటిదొంగలతో కలిసి చేసిన గోల్ మాల్ బయటపడింది. వీరికి జారీ చేసిన ఎల్ఓయూలు కూడా నకిలీవని తేలడంతో బ్యాంకు ఉన్నతాధికారులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు సీబీఐ దర్యాప్తుకు అప్పగించారు.