mobile data: మొబైల్ డేటా స్పీడ్ ను ఏ విధంగా పరీక్షిస్తున్నారో చెప్పాలంటూ ట్రాయ్ ఆదేశాలు

  • పారదర్శకత, కచ్చితత్వం అవసరం 
  • అప్పుడే వినియోగదారులు సరైన నిర్ణయం తీసుకోగలరన్న ట్రాయ్
  • ట్రాయ్ పరీక్షలకు, ప్రైవేటు సంస్థలకు పోలని లెక్కలు

దేశీయ టెలికం ఆపరేటర్ల డేటా స్పీడ్ ను ఏ విధంగా పరీక్షిస్తున్నారో చెప్పాలంటూ సర్టిఫికెషన్ సంస్థలను ట్రాయ్ ఆదేశించింది. ఒక్కో సంస్థ ఒక్కో టెలికం నెట్ వర్క్ టాప్ స్పీడ్ లో ఉందంటూ ఇస్తున్న ధ్రువీకరణలు వినియోగదారుల్లో గందరగోళానికి దారితీస్తున్నాయి. ముఖ్యంగా ట్రాయ్ తాను సొంతంగా చేస్తున్న పరీక్షల్లో రిలయన్స్ జియో 4జీ నెట్ వర్క్ దేశంలోనే వేగవంతమైన డేటా నెట్ వర్క్ గా తేలుతోంది. అమెరికాకు చెందిన ఊక్ల సంస్థ భారతీ ఎయిర్ టెల్ నెట్ వర్క్ కు దేశంలోనే అత్యంత వేగవంతమైన నెట్ వర్క్ గా గతేడాది సర్టిఫికేషన్ ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఊక్ల సంస్థ విధానాలను తప్పుబట్టిన జియో దీనిపై కోర్టులో పిటిషన్ ను కూడా దాఖలు చేసింది. అయితే ఆ తర్వాత కోర్టు ఈ పిటిషన్ ను కొట్టేసింది. అయితే, తమ పరీక్షలు చాలా కచ్చితమైనవని ఊక్ల చెబుతోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో డేటా స్పీడ్ ధ్రువీకరణకు అనుసరిస్తున్న విధానాలను గురించి పారదర్శకంగా వెల్లడించాలని, దీంతో వినియోగదారులు సరైన నిర్ణయం తీసుకోగలరని ట్రాయ్ పేర్కొంది. ‘‘ఇంటర్నెట్ స్పీడ్ అన్నది 4జీ బ్రాడ్ బ్యాండ్ అనుభవానికి సంబంధించిన ప్రాథమిక అంశం. దేశంలో డేటా వినియోగం గణనీయంగా మారిపోయింది. బ్రాడ్ బ్యాండ్ సేవల్ని కొలిచేందుకు కచ్చితత్వం అవసరం. వినియోగదారులు సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇది తోడ్పడుతుంది’’ అని ట్రాయ్ ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

  • Loading...

More Telugu News