BJP: అన్ని సమస్యలు పరిష్కరిస్తాం..ఆందోళన ఆపండి : సుజనాతో చెప్పిన ప్రధాని మోదీ
- పీఎంఓ నుంచి సీఎం చంద్రబాబుకు ఫోన్
- చంద్రబాబు సూచన మేరకు మోదీని కలిసిన సుజనా చౌదరి
- సుమారు అరగంటకు పైగా మోదీ-సుజనా భేటీ
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయం, రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలు నిరసిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై లోక్ సభలో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) నుంచి సీఎం చంద్రబాబుకు ఫోన్ వచ్చింది. టీడీపీ పార్లమెంటరీ నేతను ప్రధాని మోదీ కలవాలనుకుంటున్నారని ఆ ఫోన్ లో చెప్పారు.
చంద్రబాబు సూచన మేరకు ప్రధానిని టీడీపీ ఎంపీ సుజనాచౌదరి కలిశారు. సుమారు అరగంటకు పైగా జరిగిన ఈ భేటీలో ఆయా సమస్యలను మోదీ దృష్టికి సుజనా చౌదరి తీసుకెళ్లినట్టు సమాచారం. మిత్రపక్షంగా సహకరిస్తున్నామని, అన్నివిషయాల్లోనూ బీజేపీ వెన్నంటే ఉన్నామని, ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏపీ పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మోదీతో సుజనా చెప్పారట. ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజ్ ఇస్తామని ప్రకటించి ఏడాది గడుస్తున్నా పట్టించుకోవడం లేదని, చాలా రాష్ట్రాలకు జీఎస్టీ తర్వాత కూడా ప్రత్యేక హోదా కొనసాగిస్తున్న విషయాలను సుజనా వివరించారు.
కేంద్ర ప్రభుత్వానికి అన్ని విషయాల్లో సహకరిస్తున్న ఏపీ విషయంలో వివక్ష కొనసాగుతోందని, అమరావతి రాజధాని శంకుస్థాపన విషయంలో ఇచ్చిన వాగ్దానాల ఊసే ఎత్తడం లేదని మోదీతో సుజనా అన్నారట. సుజనా వ్యాఖ్యలకు మోదీ స్పందిస్తూ, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, కాకపోతే, టీడీపీ చేపట్టిన ఆందోళనను విరమించాలని కోరినట్టు తెలుస్తోంది. ఆందోళన విరమించే అంశం తన చేతిలో లేదని మోదీతో సుజనా చెప్పారట. ఇందుకు, మోదీ స్పందిస్తూ, ఈ విషయమై చంద్రబాబుతో తానే స్వయంగా మాట్లాడతానని చెప్పినట్టు తెలుస్తోంది.