Andhra Pradesh: బడ్జెట్ లో మహిళా సంక్షేమం గురించిన ప్రస్తావనే లేదు: నన్నపనేని రాజకుమారి
- దేశంలో మహిళా వ్యవసాయదారులు, కూలీలు ఉన్నారు
- కేంద్ర ప్రభుత్వం వారిని పట్టించుకోకపోవడం బాధాకరం
- బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగింది : రాజకుమారి
కేంద్ర బడ్జెట్ లో మహిళలకు అన్యాయం జరిగిందని, మహిళా సంక్షేమం గురించిన ప్రస్తావనే లేదంటూ ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, దేశంలోని అనేక రాష్ట్రాలలో మహిళా వ్యవసాయదారులు, కూలీలు ఉన్నారని, వారిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు.
కేంద్ర బడ్జెట్ తో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి, ఇతర భవనాల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబుపై నమ్మకంతో విదేశాల నుంచి కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం కూడా సీఎం చంద్రబాబుకు సహాయసహకారాలు అందించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.