Railway Budget: తెలంగాణలో ఆగకుండా దూసుకెళ్లిన 'రైలు'.. రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర నిరాశ!
- కేటాయింపుల్లో రాష్ట్రానికి మొండిచేయి
- పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి నిధుల విదిలింపు
- మొత్తం కేటాయింపుల్లో తెలంగాణకు 1.23 శాతమే
బడ్జెట్ రైలుకు తెలంగాణలో బ్రేకులు పడలేదు. ‘రైలు’ కోసం ఎదురుచూసిన ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది. ఈసారి బడ్జెట్లో రూ.1,46,500 కోట్లను కేటాయించినా రాష్ట్రానికి కేటాయించింది మాత్రం రూ.1,813 కోట్లు మాత్రమే. మొత్తం కేటాయింపుల్లో ఇది 1.23 శాతం మాత్రమే. అయితే బడ్జెట్లోనే కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయాలని ఏమీ లేదని, ఎప్పుడైనా చేయొచ్చని కేంద్రం చెబుతోంది. డిమాండ్‌కు తగ్గట్టుగా రైల్వే లైన్లు లేకపోవడంతో కొత్త రైళ్ల ఊసెత్తలేదు. రెండు, మూడో లైన్ల నిర్మాణాలపైనా కేంద్రం పెద్దగా శ్రద్ధ చూపలేదని బడ్జెట్ కేటాయింపులు చూస్తే అర్థమవుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే రైల్వే బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి చూపించారు.
బడ్జెట్లో ప్రస్తుత కేటాయింపులు చూస్తే దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) పరిధిలో చేపట్టిన ప్రాజెక్టులు మరో దశాబ్దమైనా పూర్తయ్యే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఎస్ఈఆర్ పరిధిలో ప్రస్తుతం 2,623 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ల కోసం 22 ప్రాజెక్టులు చేపట్టారు. ప్రస్తుతం ఇవి వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.19,983 కోట్లు. తాజా బడ్జెట్లో కేటాయించింది రూ.1,757 కోట్లు. అందులో తెలంగాణకు కేటాయించింది కేవలం రూ.675 కోట్లు. ఈ లెక్కన చూస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు ఏళ్లకేళ్లు పట్టే అవకాశం ఉంది.