Supreme Court: వాహనం అమ్మాక ఓనర్షిప్ మార్చలేదా?.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- వాహనాన్ని ఎన్నిసార్లు విక్రయించినా ఓనర్షిప్ మారకపోతే అంతే సంగతులు
- ఆ వాహనం ద్వారా జరిగే ప్రమాదాలకు నిజ యజమానే బాధ్యత వహించాల్సి ఉంటుంది
- బాధితులకు పరిహారం కూడా చెల్లించాల్సిందే
- తేల్చి చెప్పిన త్రిసభ్య ధర్మాసనం
కారు విక్రయించాక ఓనర్షిప్ మార్చని వారి విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఆ వాహనాన్ని వేరే వ్యక్తి సొంతం చేసుకున్నప్పటికీ జరిగే ప్రమాదాలకు మాత్రం అమ్మిన వ్యక్తే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. బాధితులకు పరిహారం లాంటివి నిజ యజమానే చెల్లించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.
విజయ్ కుమార్ అనే వ్యక్తి జూలై 12, 2007లో మరో వ్యక్తికి తన కారును విక్రయించాడు. సెప్టెంబరు 18, 2008లో ఆయన మరో వ్యక్తికి ఆ వాహనాన్ని అమ్మేశాడు. ఈ మూడో వ్యక్తి నవీన్ కుమార్‌కు కారును విక్రయించాడు. ఆయన మీర్ సింగ్ అనే వ్యక్తికి దానిని విక్రయించినట్టు ‘మోటార్ యాక్సిడెంట్స్ క్లైమ్స్ ట్రైబ్యునల్’కు తెలిపాడు.
మీర్ సింగ్ వద్ద ఉన్న కారును వేరే వ్యక్తి నడుపుతున్నాడు. ఈ క్రమంలో మే 27, 2009లో కారు ప్రమాదానికి గురైంది. ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసును విచారించిన ట్రైబ్యునల్ బాధిత కుటుంబానికి పరిహారంగా రూ.3.85 లక్షలు చెల్లించాల్సిందిగా రిజిస్ట్రేషన్ పత్రాల ఆధారంగా కారు యజమాని విజయ్‌కుమార్‌ను ఆదేశించింది.
ట్రైబ్యునల్ తీర్పును విజయ్ కుమార్ హరియాణా హైకోర్టులో, తర్వాత సుప్రీంకోర్టులో సవాలు చేశాడు. కేసును విచారించిన త్రిసభ్య ధర్మాసనం కారు రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉన్న యజమానే అందుకు బాధ్యుడు అవుతాడని వ్యాఖ్యానించింది. ఓనర్షిప్ మార్చకుండా ఎన్నిసార్లు విక్రయించినా, ఎంతమంది నడిపినా రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉన్న వ్యక్తే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.