Ravichandran Ashwin: మణికట్టు స్పిన్నర్ గా మారిన రవిచంద్రన్ అశ్విన్!
- సంప్రదాయ బౌలింగ్ శైలిని అనుసరించిన అశ్విన్
- మణికట్టు బౌలింగ్ తో టీమిండియాలో రాణిస్తున్న చాహల్, కుల్దీప్
- బౌలింగ్ శైలి మార్చుకుని, మణికట్టు బౌలర్ గా మారిన అశ్విన్
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ శైలి మార్చుకున్నాడు. తన బౌలింగ్ తో ఎన్నో అద్భుతాలు సాధించిన అశ్విన్ గత కొంతకాలంగా వన్డే జట్టులో స్థానం కోల్పోయి, టెస్టులకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో మరోసారి తనసత్తా చాటాలని భావించిన అశ్విన్... ఏకంగా తన బౌలింగ్ శైలిని మార్చుకుని విజయ్ హజారే ట్రోఫీలో మణికట్టు స్పిన్నర్ గా రంగప్రవేశం చేశాడు.
మణికట్టుతో తొలిసారి బౌలింగ్ చేసిన అశ్విన్... గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో 9 ఓవర్లు వేసి 38 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ లో కూడా ఇదే శైలితో బౌలింగ్ చేయాలనుకుంటున్నట్టు తెలిపాడు. దానికోసమే తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పాడు. కాగా, మణికట్టు మాయాజాలంతో చాహల్, కుల్దీప్ లు జట్టులో సుస్థిరస్థానం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. వారికి పోటీగా అశ్విన్ తయారవుతున్నాడు.