Chandrababu: పార్లమెంటులో టీడీపీ ఎంపీల నేటి డిమాండ్ ఇదే!
- గత రెండు రోజులుగా టీడీపీ ఎంపీల నిరసనలు
- నేడు కూడా కొనసాగనున్న నిరసనలు
- కాల పరిమితిని కోరనున్న తెలుగుదేశం
- చర్చకు పట్టుబట్టాలని సూచించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గత రెండు రోజులుగా నిరసనలకు దిగిన తెలుగుదేశం ఎంపీలు, నేడు మూడో రోజూ వాటిని కొనసాగించాలని నిర్ణయించారు. ఈ ఉదయం కొందరు ఎంపీలతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు, హామీల అమలుకు నిర్దిష్ట కాలపరిమితిని ప్రకటించాలని నేడు డిమాండ్ చేయాలని సూచించారు.
అలాగే అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలవాలని సూచించారు. హామీల అమలుకు కాల పరిమితిని ప్రకటించేలా ఒత్తిడి తేవాలని చెప్పారు. ఎంపీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలపై స్వల్పకాలిక చర్చకు కూడా పట్టుబట్టాలని చంద్రబాబు తెలిపారు. ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని, విభజన సమయంలో పార్లమెంట్ లో ఆరు నెలలు పోరాటం చేశామని గుర్తు చేసిన ఆయన, ప్రజాభీష్టం మేరకే తాను నడుచుకుంటానని స్పష్టం చేశారు.
ఆర్థిక లోటు భర్తీపై కొత్త ఫార్ములాను తెస్తామని అరుణ్ జైట్లీ చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ ఫార్ములా ఏంటో బహిరంగ ప్రకటన చేయాలని జైట్లీని డిమాండ్ చేయాలని కూడా ఎంపీలకు సూచించారు. విభజనకు లేని ఫార్ములా రాష్ట్రాన్ని ఆదుకోవడంలో ఎందుకని నిలదీయాలని చంద్రబాబు చెప్పినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.