Venkaiah naidu: 'హిజ్ ఎక్సెలెన్సీ' వద్దు... 'గౌరవనీయులైన ఛైర్మన్' అంటే చాలు!: సభ్యులకు రాజ్యసభ ఛైర్మన్ సూచన
- కొత్త సంప్రదాయానికి తెరదీసిన ఉప రాష్ట్రపతి
- 'హిజ్ ఎక్సెలెన్సీ' మాట ఇబ్బందిగా ఉందన్న రాజ్యసభ ఛైర్మన్
- ఇలాంటి గౌరవ వాచకం అవసరం లేదని సూచన
రాజ్యసభ ఛైర్మన్‌గా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. అవసరం లేని పాత సంప్రదాయాలకు చరమగీతం పాడుతున్నారు. తాజాగా ఛైర్మన్‌ను సంబోధించే సమయంలో పేరుకు ముందు ఉపయోగించే 'హిజ్ ఎక్సెలెన్సీ' అనే గౌరవ వాచకాన్ని పక్కనపెట్టాలని మంగళవారం ఆయన సభ్యులకు సూచించారు. ఇలా పిలుస్తుంటే తనకు చాలా ఇబ్బందిగా ఉందని ఆయన అన్నారు. బ్రిటీష్ కాలం నుండి అమల్లో ఉన్న ఈ వాక్యాన్ని భవిష్యత్తులో వాడాల్సిన పనిలేదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం గమనార్హం.
సభ జీరో అవర్‌లో జనతాదళ్ సభ్యుడు హర్వాన్ష్ నారాయణ్ సింగ్ కొన్ని పత్రాలను సమర్పిస్తున్న సమయంలో వెంకయ్య ఈ మేరకు సూచనలు చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌గా వెంకయ్య ఇలాంటి గౌరవ వాచకాలను పక్కన పెట్టిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. పత్రాలను బల్లపై ఉంచే ముందు 'I beg' (నేను అర్థిస్తున్నా) అని చెప్పడానికి బదులుగా 'నేను సభ దృష్టికి తీసుకువస్తున్నా' అని చెబితే సరిపోతుందని కూడా ఆయన ఇదివరకే సూచించిన సంగతి విదితమే.