CBDT: ఆదాయపు పన్ను చెల్లింపుల్లో చిన్నపాటి మొత్తంలో తేడాలకు ఇకపై నోటీసులు ఇవ్వరు!
- ఇకపై చెల్లింపుల్లో స్వల్ప తేడాలకు నోటీసులివ్వరాదని నిర్ణయం
- ఈ ఏడాది ఏప్రిల్ నుండే ఈ విధానం అమల్లోకి
- ఎనిమిది కోట్లకు పెరిగిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య
ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్-సీబీడీటీ) పన్ను చెల్లింపుదారులకు ఓ శుభవార్త వినిపించింది. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో చిన్నపాటి మొత్తంలో తేడాలకు నోటీసులు జారీ చేయరాదని బోర్డు విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు నివేదించామని బోర్డు ఛైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు.
2018-19 అసెస్మెంట్ ఏడాదికి గాను ఏప్రిల్ 1 నుండే దీన్ని అమల్లోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు. పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉన్నా, ఎగవేసినట్లు అనుమానాలున్నా మరింత జాగ్రత్తగా పరిశీలిస్తామని ఆయన అన్నారు. చెల్లించే ఆదాయపు పన్ను, టాక్స్ క్రెడిట్ స్టేట్మెంట్గా వ్యవహరించే ఫారం-26 ఏఎస్, ఉద్యోగులకు సంస్థ జారీ చేసే ఫారం-16లో వ్యత్యాసాల ఆధారంగా బెంగళూరులోని సీపీసీ ద్వారా ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తోంది.
మరోవైపు పన్ను చెల్లింపుదారుల జాబితాలోకి మరింత మందిని తీసుకురావడం ద్వారా మొత్తం పన్ను చెల్లింపుదారుల సంఖ్య 8 కోట్లకు చేరుకుందని సుశీల్ చంద్ర చెప్పారు. ప్రత్యక్ష పన్నుల సంస్కరణలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసిందని, వాటన్నింటినీ తాము సంఘటితం చేసి అమలు చేస్తున్నామని ఆయన అన్నారు