UIDAI: ఆధార్ కార్డు లామినేషన్ వద్దు!: ఉడాయ్
- అనధీకృత ముద్రణతో వ్యక్తిగత సమాచారం లీక్ కావొచ్చు
- ఆధార్ కార్డు పోగొట్టుకుంటే ఫ్రీగా పొందే ఛాన్స్
- ఈ-మెయిళ్లు, ఎస్ఎంఎస్లు వస్తున్నాయని పౌరుల ఫిర్యాదులు
- ఆధార్ సమాచారం సేకరించవద్దంటూ ముద్రణా సంస్థలకు వార్నింగ్
ఆధార్ కార్డులను లామినేషన్ చేయించడం లేదా ప్లాస్టిక్ కార్డులపై ముద్రించడం లాంటివి చేయొద్దని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) మంగళవారం ప్రజలకు సూచించింది. అనధీకృత ప్రింటింగ్ వల్ల క్యూఆర్ కోడ్ పని చేయకపోవచ్చని, వ్యక్తిగత సమాచారం బహిర్గతమయ్యే అవకాశముందని కూడా పేర్కొంది. ప్రజల నుండి ఆధార్ సమాచారాన్ని సేకరించడం ఐపీసీ, ఆధార్ చట్టం, 2016 కింద శిక్షార్హమైన నేరమని ముద్రణా సంస్థలనూ ఉడాయ్ హెచ్చరించింది.
ప్లాస్టిక్ లేదా లామినేటెడ్ ఆధార్ స్మార్ట్ కార్డుల తయారీ కోసం పలు వ్యాపార సంస్థల నుండి తమకు ఈ-మెయిళ్లు లేదా సెల్‌ఫోన్ సందేశాలు వస్తున్నాయని పలువురు పౌరులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఉడాయ్ ఈ మేరకు స్పష్టం చేయడం గమనార్హం. లామినేషన్లు, ప్లాస్టిక్ కార్డులు, స్మార్ట్‌కార్డుల పేరుతో డబ్బులు ఖర్చు చేయడం అనవసరమని సంస్థ సీఈఓ అజయ్ భూషణ్ అన్నారు.
తాను జారీ చేసిన ఆధార్ లేఖ లేదా దానిలో కత్తిరించగలిగేలా ఉన్న భాగమూ ఆధార్‌గా చెల్లుబాటవుతుందని ఉడాయ్ పేర్కొంది. ఒకవేళ ఆధార్ కార్డు పోగొట్టుకున్నా...తమ వెబ్సైటులో ఉచితంగా, అధికారికంగా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. కాగితంపై నలుపు, తెలుపు రంగులో ముద్రితమైన ఆధార్ కార్డూ చెల్లుబాటవుతుందని తెలిపింది. మొబైల్-ఆధార్‌నూ వినియోగించుకోవచ్చని ఉడాయ్ పేర్కొంది. కాగా, వ్యక్తిగత సమాచార గోప్యత విషయంలో వెల్లువెత్తుతున్న ఆందోళనల నేపథ్యంలో సంస్థ గతనెల ఒక కొత్త వర్చువల్ ఐడీ సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. వాస్తవికమైన 12 అంకెల బయోమెట్రిక్ ఐడీకి బదులుగా ఆధార్ కార్డు ఉన్న వారు తమ వెబ్సైటులో ఈ వర్చువల్ ఐడీని పొందవచ్చని సంస్థ తెలిపింది.