suzuki scooter: సుజుకి స్కూటర్ 'బుర్గ్ మ్యాన్ 125 సీసీ' భారత వెర్షన్ ఆవిష్కరణ
- ఆటో ఎక్స్ పోలో ప్రదర్శన
- ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి
- ధర రూ.70,000-75,000 మధ్య ఉండే అవకాశం
సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా భారత మార్కెట్లోకి మరో స్కూటర్ ను తీసుకువస్తోంది. బుర్గ్ మ్యాన్ 125 సీసీ మోడల్ ను తాజాగా జరుగుతున్న ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించింది. అంతర్జాతీయ మార్కెట్లో బుర్గ్ మ్యాన్ మ్యాక్సీ స్కూటర్ ఇప్పటికే ఉంది. ఇతర మార్కెట్లలో 638 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజన్ తో ఉండగా, దేశీయ మార్కెట్లో ఆవిష్కరించినది మాత్రం 125 సీసీ మోడల్. యాక్సెస్ 125సీసీ ఇంజన్ ఆధారంగానే దీన్ని రూపొందించడం గమనార్హం.
చూడ్డానికి భారీగా 14 అంగుళాల చక్రాలు, ఎన్నో ఫీచర్లతో ఉంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, సీటు కింద భారీ స్టోరేజీ స్పేస్, స్కూటర్ ముందు భాగంలోనూ రెండు కంపార్టుమెంట్లు ఉన్నాయి. ఒకటి లాక్ చేసుకునేందుకు, మరొకటి పుష్ బటన్ తో ఓపెన్ చేసుకునేందుకు అనువైనవి.
దీని బరువు 162 కిలోలు. సింగిల్ సిలిండర్ 125సీసీ ఇంజన్, 10.7 బీహెచ్ పీ, 8,000 ఆర్పీఎమ్ తో ఉంటుంది. లీటర్ కు 40 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని సుజుకి ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో ఇది కస్టమర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని ధర రూ.70,000-75,000 మధ్య ఉంటుంది.