Andhra Pradesh: ఏపీలో బెల్ట్ షాపు మాటే వినిపించకూడదు!: సీఎస్ దినేష్ కుమార్ ఆదేశం
- బెల్ట్ షాపుల నిరోధంపై తీసుకుంటున్న చర్యలపై సమీక్ష
- ప్రభుత్వ హెచ్చరికలు పెడచెవినపెడితే కఠిన చర్యలు
- సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశం
రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ షాపు అనే మాటే వినపడకూడదని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. ఏపీ సచివాలయంలోని తన కార్యాలయంలో రాష్ట్రంలో బెల్ట్ షాపుల నిరోధంపై తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్షించారు. ఎక్సైజ్ అధికారులతో ఈరోజు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ హెచ్చరికలు పెడచెవినపెట్టి బెల్టు షాపులు నిర్వహించే వారిపైనా, వారికి సహకరించే వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే మద్యం షాపుల యజమానులపై కేసులు నమోదు చేయాలని, అవసరమైతే ఆయా షాపుల లైసెన్సులను రద్దు చేయాలని ఆదేశించారు.తొలుత బెల్ట్ షాపుల నిరోధానికి తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎస్ కు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి డి.సాంబశివరావు వివరించారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులను సమూలంగా నిర్మూలించాలన్నారు. ఎక్కడా బెల్ట్ షాప్ మాట వినబడకూడదని అన్నారు. ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, ఎక్కడయినా బెల్ట్ షాపు నిర్వహిస్తే, సదరు నిర్వాహకుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే షాపులపైనా చర్యలు తీసుకోవాలని, ఆయా యజమానులపై కేసులు నమోదు చేయాలని, అవసరమైతే వాటి లైసెన్స్ లను రద్దు చేయాలని, బెల్ట్ షాపుల నిర్వహణలో ఒకవేళ ఎక్సైజ్ సిబ్బంది పాత్ర కనుక ఉంటే, వారిని విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. సీజ్ చేసిన వాహనాలను ఎప్పటికప్పుడు వేలం వేయించి, విక్రయించాలని, ప్రతి మూడు నెలలకొకసారి ఈ వేలం నిర్వహించాలని, కేసులు నమోదుతో పాటు ఛార్జిషీట్లు దాఖలు చేయడమే కాకుండా నిందితులకు శిక్ష పడేలా చూడాలని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 8,827 కేసులు నమోదు చేశాం
గత ఏడాది జులై 18 తేదీన రాష్ట్ర మంత్రి మండలి బెల్ట్ షాపులు మూసివేయాలని నిర్ణయించిన నాటి నుంచి నేటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 8,827 కేసులు నమోదు చేసినట్టు దినేష్ కుమార్ చెప్పారు. 9,192 మందిని అరెస్టు చేయగా, 331 వాహనాలను సీజ్ చేశామని, బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసినట్లు గుర్తించిన 265 మద్యం షాపులను మూసివేయించామని, పరిష్కార వేదిక 1100 ద్వారా 7,649 ఫిర్యాదులు రాగా, 7,641 పరిష్కారాలు చూపామని అన్నారు.