Virat Kohli: కోహ్లీ రికార్డు సెంచరీ.. మూడో వన్డేలోనూ భారత్ ఘన విజయం!
- కేప్‌టౌన్ వన్డేలో చెలరేగిన కోహ్లీ
- దక్షిణాఫ్రికాను వణికించిన చాహల్, కుల్దీప్
- 124 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
- కోహ్లీ ఖాతాలో మరో రికార్డు
ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా కేప్‌టౌన్‌లో బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 304 పరుగుల విజయ లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైన దక్షిణాఫ్రికా 124 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ గెలుపుతో భారత్ సిరీస్‌లో 3-0తో విజయం సాధించి సిరీస్ గెలుపుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది.
టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. అనంతరం భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టును యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లు మరోమారు బెంబేలెత్తించారు. చెరో నాలుగు వికెట్లు తీసుకుని దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను కకావికలు చేశారు. దక్షిణాఫ్రికాకు రెండో ఓవర్ తొలి బంతికే ఎదురుదెబ్బ తగిలింది. బుమ్రా బౌలింగ్‌లో స్టార్ ఓపెనర్ హషీం ఆమ్లా (1) ఎల్బీ అయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన డుమినీతో కలిసి కెప్టెన్ మార్కరమ్ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో డుమినీ (51) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత కుల్దీప్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయి పెవిలియన్ చేరాడు. అప్పటికి దక్షిణాఫ్రికా స్కోరు 79 పరుగులు. ఆ తర్వాతి నుంచి ఆతిథ్య జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. కుల్దీప్, చాహల్ దెబ్బకు బ్యాట్స్‌మెన్ క్రీజులో కుదురుకునేందుకు ఇబ్బంది పడ్డారు. వచ్చినవారు వచ్చినట్టు పెవిలియన్ చేరారు. దీంతో మరో పది ఓవర్లు ఉండగానే 179 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌటైంది. సఫారీ బ్యాట్స్మెన్లలో కెప్టెన్ మార్క్రమ్ (32), డుమినీ (51), డేవిడ్ మిల్లర్ (25) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్, యుజ్వేంద్ర చాహల్ చెరో నాలుగు వికెట్లు తీసుకోగా, బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఖాతా కూడా ప్రారంభించకుండానే తొలి ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. అయితే శిఖర్ ధవన్, కోహ్లీ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. ఈ క్రమంలో దూకుడు పెంచిన ధవన్ (76)ను డుమినీ అవుట్ చేశాడు. అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న కోహ్లీ కెరీర్లో 34 వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత సహచరులు ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా విరాట్ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. 159 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లతో 160 పరుగులు చేశాడు. దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ (175 నాటౌట్) తర్వాత ఓ భారత కెప్టెన్ విదేశాల్లో చేసిన అత్యధిక పరుగులు ఇవే.
కోహ్లీ దెబ్బకు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 303 పరుగులు చేసింది. రహానే 11, పాండ్యా 14, ధోనీ 10, కేదార్ జాదవ్ 1 పరుగులు చేశారు. ఈ గెలుపుతో భారత్ ఆరు వన్డేల సిరీస్‌లో 3-0 ఆధిక్యం సంపాదించి సిరీస్ గెలుపునకు మరో మ్యాచ్ దూరంలో నిలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కోహ్లీకి లభించింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే నాలుగో వన్డే ఈనెల 10న జొహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది.