Actor: బాలీవుడ్ నటుడు జితేంద్రపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. నేడు కేసు నమోదు చేసే అవకాశం?
- 50 ఏళ్ల క్రితం ఓ హోటల్లో తనను వేధించారన్న బాధితురాలు
- కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు రెండు పేజీల లేఖ
- ‘బేస్‌లెస్’ అంటూ కొట్టిపారేసిన నటుడి తరపు న్యాయవాది
ప్రముఖ నటుడు, నిర్మాత, బాలాజీ టెలిఫిలిమ్స్ చైర్మన్ జితేంద్ర తనను లైంగికంగా వేధించారని ఓ మహిళ ఆరోపించింది. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ పోలీసులకు లేఖ రాసింది. తనను లైంగికంగా వేధించిన జితేంద్రపై కేసు నమోదు చేయాలని కోరింది. ఈ మేరకు హిమాచల్‌ప్రదేశ్ డీజీకి లేఖ రాసింది. అప్పట్లో 28 ఏళ్ల వయసున్న జితేంద్ర 18 ఏళ్ల వయసున్న తనను లైంగికంగా వేధించారని లేఖలో పేర్కొంది.
మహిళ ఆరోపణలను జితేంద్ర తరపు న్యాయవాది కొట్టిపడేశారు. ఇదో అర్థం పర్థం లేని ఆరోపణ అని అన్నారు. 50 ఏళ్ల తర్వాత తన క్లైయింట్‌పై లైంగిక ఆరోపణలు చేస్తోందని, దీనిని కోర్టు కానీ, పోలీసులు కానీ విశ్వసించరని పేర్కొన్నారు. 1971లో ఓ సినిమా షూటింగ్లో భాగంగా జితేంద్ర తనను లైంగిక వేధింపులకు గురిచేసినట్టు ఆమె లేఖలో ఆరోపించింది. షూటింగ్ స్పాట్ వద్ద తనను కారులో ఎక్కించుకుని ఢిల్లీ నుంచి ఓ హోటల్ రూముకు తీసుకెళ్లారని, అక్కడ రెండు వేర్వేరు బెడ్లు ఉన్నాయని పేర్కొంది.
ప్రయాణ బడలికతో తాను నిద్రపోయానని, అయితే కాసేపటి తర్వాత మెలకువ వచ్చి చూస్తే జితేంద్ర తన బెడ్‌పై ఉన్నారని, అతడి నుంచి మద్యం వాసన వచ్చిందని తెలిపింది. తనపై అత్యాచారం చేసిన అనంతరం ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారని వివరించింది. ఆ రాత్రికి తాను అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని పోలీసుకు పంపిన రెండు పేజీల లేఖలో ఆమె పేర్కొంది.
ఆన్లైన్ ద్వారా బాధితురాలి నుంచి లేఖను అందుకున్నట్టు ఎస్పీ (లా అండ్ ఆర్డర్) కుషాల్ శర్మ తెలిపారు. ఈ లేఖ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా? లేదా? అనేది గురువారం నిర్ణయిస్తామని పేర్కొన్నారు.