Chandrababu: అరుణ్ జైట్లీ మాట్లాడేటప్పుడు ఆందోళనలు, నిరసనలు చేపట్టండి: ఎంపీలకు చంద్రబాబు ఆదేశం
- బడ్జెట్ పై జైట్లీ మాట్లాడేటప్పుడు ఆందోళనలు చేయండి
- నిరసన వ్యక్తం చేయండి
- ఎంపీలకు చంద్రబాబు మార్గనిర్దేశం
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ ఎంపీలు దూకుడుగా వ్యవహరిస్తూ, ఉభయసభల్లో నిరసన కార్యాక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు సూచనల మేరకు ప్రధాని ప్రసంగం సమయంలో మాత్రం సీట్లలో కూర్చున్నారు. అయితే, ప్రధాని మోదీ నుంచి ఏపీ ప్రయోజనాలకు సంబంధించి ఎలాంటి హామీలు రాకపోవడంతో ఎంపీలు మళ్లీ ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో, సస్సెన్షన్ కు కూడా గురయ్యారు.
తాజాగా పార్లమెంటులో ఈరోజు వ్యవహరించాల్సిన తీరుపై టీడీపీ ఎంపీలకు చంద్రబాబు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఉభయసభల్లో ఆందోళనలను తీవ్రతరం చేయాలని ఆదేశించారు. ఎంపీలతో ఈ ఉదయం ఆయన టెలీకాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడ్జెట్ పై అరుణ్ జైట్లీ సమాధానం చెప్పేటప్పుడు ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని, నినాదాలు చేయాలని సూచించారు. ఏ క్షణంలో కూడా వెనక్కి తగ్గవద్దని స్పష్టం చేశారు.