flow: ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ఫ్లో ఆవిష్కరణ... నేటి నుంచే బుకింగ్... ధర రూ.74,740
- ఒక్క రీచార్జ్ తో 80 కిలోమీటర్ల మైలేజీ
- గరిష్ట వేగం 60 కిలోమీటర్లు
- ముందుగా బుక్ చేసుకున్న వారికి ఏప్రిల్ నుంచి డెలివరీ
ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుండడంతో కంపెనీల నుంచి ఈ తరహా ఆవిష్కరణలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఆటో ఎక్స్ పో 2018లో ట్వెంటీ టు మోటార్స్ అనే స్టార్టప్ సంస్థ ఫ్లో పేరుతో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఈ రోజు ఆవిష్కరించింది. దీని ధర రూ.74,740. మూడేళ్లలో 2 లక్షల వాహనాలను అమ్మాలనుకుంటోంది. హర్యానాలోని తయారీ యూనిట్ లో వాహనాలను తయారు చేయనున్నట్టు కంపెనీ తెలిపింది.
రోజుకు 300 వాహనాల తయారీతో కార్యకలాపాలు ఆరంభించనున్నామని కంపెనీ సీఈవో ప్రవీణ్ ఖర్బ్ ప్రకటించారు. ఈ స్కూటర్ లో జియో ఫెన్సింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. నిర్ణీత సరిహద్దులు దాటి స్కూటర్ బయటకు వెళ్లిందంటే అలర్ట్ చేస్తుంది. అంటే ఎవరైనా స్కూటర్ ను తస్కరించి తీసుకెళెతుంటే అప్రమత్తం చేస్తుంది. ఒక్కసారి రీచార్జ్ చేసుకుంటే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. దీని గరిష్ట వేగం 60 కిలోమీటర్లు. వాహనాలకు ముందస్తు బుకింగ్ లు నేటి నుంచి ప్రారంభం కాగా, ఏప్రిల్ నుంచి డెలివరీ చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. కంపెనీ వెబ్ సైట్ చిరునామా http://www.22motors.in/